పార్టీ కోసం కష్టపడిన వారికే స్థానికఎన్నికల్లో ప్రాధాన్యం: బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:39 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గుంటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు.
గుంటూరు, (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ స్థానికసంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత, గుంటూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బోనబోయిన శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కోసం మొదటినుంచి కష్టపడినవారికి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. టీడీపీ, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం బీసీల పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని బోనబోయిన కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరస్తోందన్నారు. ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యా్ణ్ గిరిజన ప్రాంతాల్లో మౌలికవసతులను కల్పించారన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే సీఎం చంద్రబాబు హయంలోని కూటమి ప్రభుత్వం సహించబోదని ఆయన హెచ్చరించారు.
అయితే, ఈ మధ్య కాలంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై బోనబోయిన స్పందించారు. ‘ నా జీవితంలో గత నెల నుంచి అనుకోని వరుస సంఘటనలు జరుగుతున్నాయి. నాకు వాటితో ఎటువంటి సంబంధం లేదు. కొందరు నాపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారం చేస్తున్నార’ని ఆయన అన్నారు. కాగా, తనపై ఓ వైసీపీ నేత హత్యాయత్నానికి పాల్పడ్డారని బోనబోయిన ఇటీవలె ఆరోపించారు. ఈ నేపథ్యంలో మీడియా దృష్టిని ఆకర్షించడానికే బోనబోయిన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
పిల్లలకు డబ్బు విలువ తెలియాల్సిందే...