Share News

చిన్న ఆచరణ... చింతలేదింక!

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:06 PM

కొన్నిసార్లు చిన్న చిన్న ఆచరణలే జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. జపనీయులు రోజువారీ అలవాట్ల సరళతకు పెట్టింది పేరు.

చిన్న ఆచరణ... చింతలేదింక!
Lifestyle

కొన్నిసార్లు చిన్న చిన్న ఆచరణలే జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. జపనీయులు రోజువారీ అలవాట్ల సరళతకు పెట్టింది పేరు. వాళ్లు పాటించే కొన్నింటిని... దినచర్యలో భాగం చేసుకుంటే, ఒత్తిడిని ఎంచక్కా దూరం చేసుకోవచ్చు.

  • రోజులో కొంత.. ప్రకృతి చెంత (షిన్రిన్‌- యోకు): ‘ఫారెస్ట్‌ బాతింగ్‌’గా ఇది ప్రసిద్ధి చెందింది. అంటే రోజులో కనీసం 15- 20 నిమిషాలైనా అడవిలోనో, పార్కులోనో చెట్ల మధ్య నెమ్మదిగా నడుస్తూ, ప్రకృతిని గమనిస్తూ గడపడం. ప్రతీ రుతువూ తెచ్చే మార్పును కుతూహలంతో వీక్షించాలి. ఫోను పక్కన పెట్టాలి. దీంతోపాటు జపాన్‌లో చాలామందికి నడవటం దైనందిన జీవితంలో ఓ భాగం.


  • అనవసర వస్తువుల తగ్గింపు (దన్‌షరి): వాడని, అవసరం లేని వస్తువులు చాలా ఉంటాయి. అవన్నీ పేరుకుపోయి ఇంటిని ఇరుకుగా మారుస్తాయి. దీంతో మనసుపై ఒక రకమైన భారం పెరుగుతుంది.జపనీస్‌ భావనల్లో.. అవసరం లేని దాన్ని తిరస్కరిం చడం, ఉన్నదాన్ని వదులుకోవడం, వస్తు వ్యామోహం తగ్గించుకోవడం ముఖ్యమైనవి. ప్రతీ వారాంతం ఇంట్లో ‘ఈ వస్తువు నిజంగా అవసరమా?’ అని ప్రశ్నించు కుంటూ వ్యర్థమైనవాటిని తొలగించాలి.


  • ఒకసారి ఒకే పని (ఇచిగ్యో-జమ్మై): ఒకేసారి పది పనులు చేయడం వల్ల మెదడు అలసిపోవచ్చు. ఒకపనిలో పూర్తిగా లీనమవడం జపాన్‌ సంస్కృతిలో కనిపిస్తుంది. తినేటప్పుడు తినడం, చదివేటప్పుడు చదవడం, ఎవరినైనా కలిసినప్పుడు ఫోను చూడకుండా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్‌ తగ్గించాలి.


  • ఉదయాన్ని నెమ్మదిగా ఆరంభించడం (అస-జికన్‌): నిద్ర లేవగానే ఫోన్‌ నోటిఫికేషన్లు, వాట్సాప్‌ సందేశాలు, సోషల్‌మీడియా స్ర్కోలింగులు మొదలుపెడితే మెదడు అప్పటికే ఇతరుల ప్రపంచంలోకి వెళ్లిపోతుంది. దానికి బదులు.. పొద్దున్నే నీళ్లు తాగడం, కిటికీ తెరిచి బయటి వెలుతురు చూడటం, కొన్ని నిమిషాలు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండటం, ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన 2-3 పనులను మాత్రమే గుర్తు చేసుకోవడం లాంటి చిన్న మార్పులు ఉపయోగపడతాయి.


  • ఆహారాన్ని సరిగా ఆస్వాదించడం (మరా హచి బు): ఒకేసారి కడుపు నిండేవరకూ తినడం కాకుండా... 80 శాతం నిండగానే ఆపడం ‘ఒకినవ’ ఆహార సంస్కృతికి సంబంధించినది. ఎంత తింటున్నామన్నదే కాకుండా... ఎలా తింటున్నామన్నదీ ముఖ్యం.


  • లోపాల్లోనూ అందాన్ని చూడటం (వబి-సబి): పరిపూర్ణంగా లేని వస్తువుల్లోనూ అందాన్ని గుర్తించడం ఈ భావనలోనిముఖ్యమైన అంశం. పాత కుర్చీకి ఉన్న గీతలు, వయసుతో వచ్చిన ముఖంలోని ముడతలు... ఇలాంటి వాటిలో దాగివున్న సహజత్వాన్నీ, సౌందర్యాన్నీ గమనించగలగాలి. ‘పర్‌ఫెక్షన్‌’ అనే ఒత్తిడిని ఇలాంటి దృక్పథం కొంత తగ్గిస్తుంది.


  • రాత్రికి రోజును ముగించడం (ఇచినిచి ఓ ఎరు): నిద్రపోవడానికి ముందు రేపటి పనులన్నీ తలచుకోవడానికి బదులు... ఈ రోజు పూర్తయిన మూడు విషయాలేమిటి? రేపు తప్పనిసరిగా చేయాల్సిన ఒక పని ఏమిటి? అంతవరకే ఆలోచించాలి. మిగిలినవి తర్వాతి రోజు చూసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

హాథీ.. హమారా సాథీ!

గంగబాయిలమ్మ ఆకుకూర

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 12:06 PM