55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:26 AM
మహిళల ఆసియా కప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భారత స్పిన్నర్ల ధాటికి పాక్ 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 8.4 ఓవర్లలోనే టీమిండియా ఆటను ముగించింది. పాకిస్థాన్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన మైదానంలో క్లియర్‌గా కనిపించింది. బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. కానీ పాక్ కోచ్ మాత్రం ఆసియా కప్ తామే గెలుస్తామని చెప్పడం గమనార్హం.
‘మా జట్టులో ప్లేయర్లందరూ మంచి ప్రతిభ ఉన్నవారే. వాళ్లు తమపై తాము నమ్మకం ఉంచాలి. మా తర్వాతి మ్యాచ్ హాంకాంగ్‌తో ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో ఏం తప్పులు చేశామో సమీక్షించుకుంటా. ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం. ఈ ఆసియా కప్‌లో ట్రోఫీ గెలిచే అత్యుత్తమ జట్టు పాకిస్థాన్ అని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. ఇక్కడి పరిస్థితులు మా జట్టుకు బాగా అనుకూలిస్తాయి. ఆసియా కప్ గెలిచేది మేమే’ అని రియాజ్ వెల్లడించాడు.
ఆమెతో మాకు సంబంధం లేదు..
పాకిస్థాన్ ప్లేయర్ సనా మీర్ జట్టు కూర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆసియా కప్ కోసం జట్టులో భారీగా మార్పులు చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. సనా మీర్ వ్యాఖ్యలపై స్పందించిన వహాబ్.. ఆమె అభిప్రాయంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ‘సనా మీర్‌కు తన సొంత అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జట్టులో మార్పులు చేశాం. ఇంతకుముందు ఆడిన ప్లేయర్లు చాలా ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లు ఆడారు. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చి, రాబోయే టోర్నీల కోసం జట్టును నిర్మించాలని నిర్ణయించాం’ అని వహాబ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
షఫాలీని ఔట్ చేసి.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్!
ప్లేయర్ల ఫోన్ల స్వాధీనం.. పాకిస్థాన్ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?