సొరచేప దాడి.. బాధితుడిని కాపాడుకునేందుకు నీళ్లల్లోకి దూకి..
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:31 PM
సొరచేపకు బలికావాల్సిన వ్యక్తిని ఓ నౌక కెప్టెన్ అత్యంత ధైర్యస్థైర్యాలతో కాపాడిన ఘటన ఫ్లోరిడాలో తాజాగా వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: సొరచేపకు బలికావాల్సిన వ్యక్తిని ఓ నౌక కెప్టెన్ అత్యంత ధైర్యస్థైర్యాలతో కాపాడిన ఘటన ఫ్లోరిడాలో తాజాగా వెలుగు చూసింది. ఎమరాల్డ్ తీరానికి 30 మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సొరచేప బారినపడ్డ వ్యక్తిని కాపాడిన బోట్ కెప్టెన్ జాన్సన్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, బోటు కెప్టెన్ సహా నలుగురు వ్యక్తులు సముద్రంలో ఈతకు దిగారు. కాసేపటి కెప్టెన్‌తో పాటు ఇద్దరు బోటు పైకి వచ్చేశారు. చివరి వ్యక్తి కూడా బోటు పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో సొరచేప అకస్మాత్తుగా దాడి చేసింది. అతడి చేతులను కొరికేసింది. దీంతో, బాధితుడు హాహాకారాలు చేశాడు. చేతులకు కాస్త తీవ్రగాయాలు కావడంతో బోటుపైకి తనంతటతానుగా ఎక్కలేకపోయాడు.
అతడి అరుపులు విన్న బోటు కెప్టెన్ మొదట చిన్న చేప ఏదో దాడి చేసిందని భావించాడు. వెనక్కు తిరిగి చూసే సరికి మాత్రం షాకింగ్ దృశ్యం కనిపించింది. చేతులకు తీవ్రగాయాల కారణంగా రక్తస్రావం కావడంతో బాధితుడు బోటుపైకి రాలేక ఇబ్బంది పడుతూ కనిపించాడు. దీంతో, జాన్సన్ మరో ఆలోచన లేకుండా వెంటనే నీళ్లల్లోకి దూకాడు. అతడిని జాగ్రత్తగా బోటుపై చేర్చాడు. ఆ సమయంలో సొర మళ్లీ దాడి చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
‘ఆ క్షణంలో నాకు ఆలోచించే సమయం లేదు. అతడిని కాపాడేందుకు నాకు తెలీకుండానే వేగంగా స్పందించాను. అతడిని బోటుపైకి తీసుకొచ్చాము. ఆ తరువాత రక్తస్రావం కాకుండా చేతులకు గట్టిగా కట్టుకట్టాము. ఈ లోపు కోస్టుగార్డు వాళ్లు వచ్చి బాధితుడిని తీరానికి తీసుకెళ్తారు. అనంతరం హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించాము. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నాడు’ అని బోటు కెప్టెన్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆ నౌకను జలసమాధి చేసేశాం.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన యూఎస్
విమానంలో అలజడి సృష్టించిన వృద్ధుడు.. ప్లాస్టర్‌తో సీటుకు కట్టేసిన సిబ్బంది..