Share News

ఆ ఒక్కటి తక్క!

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:14 AM

మాజీ సీఎం జగన్‌ శ్రీకాకుళం పర్యటనలో పరామర్శలు ఉంటాయని అంతా భావించారు. యాక్సిడెంట్‌ ఘటనలో కుమారుడిని కాపాడటానికి కుట్ర చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జగన్‌ పరామర్శిస్తారని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు.

ఆ ఒక్కటి తక్క!
YS Jagan Mohan Reddy

  • వెళ్లింది సీదిరి పరామర్శకు.. అది తప్ప హడావుడంతా చేసొచ్చిన జగన్‌

  • విశాఖ టు సిక్కోలు పట్టేది ఒక గంట..

  • దానికి 6 గంటలపాటు సాగ..దీత

  • బల ప్రదర్శనలా సాగిన యాత్ర

  • ములాఖత్‌ టైమ్‌ అయ్యాక జైలు వద్దకు

  • అక్కడున్న గంటలోనే అరాచక పర్వం

  • రప్పా రప్పా నినాదాలు.. పోలీసులపైకి రాళ్లు

  • స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టిన పోలీసులు

  • పాపం.. పిల్లోడు.. జగన్‌ నోట మళ్లీ అదే మాట!

  • సీదిరి కుట్ర సంగతి వదిలి ప్రభుత్వంపై విమర్శలు

శ్రీకాకుళం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ శ్రీకాకుళం పర్యటనలో పరామర్శలు ఉంటాయని అంతా భావించారు. యాక్సిడెంట్‌ ఘటనలో కుమారుడిని కాపాడటానికి కుట్ర చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జగన్‌ పరామర్శిస్తారని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు. కానీ, ఆ ఒక్కటి తక్క.. అన్నట్టు ఆ పని వదిలేసి వైసీపీ అధినేత తక్కిన హడావుడి అంతా చేశారు. జగన్‌ పర్యటన ఆసాంతం బల ప్రదర్శనలా సాగింది. అడుగడుగునా ‘అతి’ ప్రదర్శనే కనిపించింది.


ఎన్‌హెచ్‌ మీదుగా విశాఖ నుంచి శ్రీకాకుళం చేరడానికి పట్టే సమయం గంట. అలాంటిది ఆరు గంటల సమయం ఆయన తీసుకున్నారు. పది మంది గుమిగూడిన చోటల్లా ఆగుతూ, రోడ్‌షోలు సాగిస్తూ, కార్యకర్తలకు అభివాదం చేస్తూ.. పర్యటనను జగన్‌ సాగ..దీశారు. పథకం ప్రకారం జగన్‌ కాన్వాయ్‌ ముందుకు కదలకుండా రోడ్డు మీద వాహనాలు, బైక్‌లు అడ్డదిట్టంగా పెట్టారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన శ్రీకాకుళం చేరుకోవాలి. అంపోలు జైలులో సీదిరిని పరామర్శించి మూడు గంటలకల్లా వెనుదిరగాలి. కానీ, శ్రీకాకుళం చేరేటప్పటికే ఐదు దాటిపోయింది. ములాఖత్‌ సమయం కూడా అయిపోయింది. జైలు దగ్గర ఉన్న అప్పలరాజు సతీమణి, కుమారుడు ఆరవ్‌ వర్మను జగన్‌ పలకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


జైలు వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు...

శ్రీకాకుళం జిల్లా సరిహద్దు పైడి భీమవరం వద్దకు జగన్‌ కాన్వాయ్‌ చేరగానే.. అక్కడ వైసీపీ నాయకులు జనసమీకరణ చేశారు. కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీకాకుళం నుంచి అంపోలు జిల్లా జైలుకు వెళ్లే మార్గంలో పోలీసులపై కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. జనసమీకరణలో భాగంగా కార్యకర్తలను, మరికొంతమంది యువకులను నాయకులు రోడ్డెక్కించారు. ఈ క్రమంలో ఆంక్షలను ఉల్లంఘించారు. జగన్‌కు రోడ్‌షో చేసేందుకు అనుమతి లేదు. కానీ, ఒకరిద్దరు రోడ్డు పక్కన నిలబడి ఉన్నా.. కాన్వాయ్‌ ఆపి.. వారికి అభివాదం చేశారు. జైలు నుంచి జగన్‌ వెనుదిరిగిన సమయంలో.. ‘రప్పా.. రప్పా’ అంటూ కొందరు నినాదాలు చేస్తూ..వీరంగం చేశారు. కాగా, జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులందరూ హాజరైనా మాజీస్పీకర్‌ తమ్మినేని సీతారాం మాత్రం దూరంగా ఉన్నారు. సీతారాంకు అనుమతి లేదని, పర్యటనలో పాల్గొనవద్దని ఆదేశాలు వెళ్లాయని తెలిసింది.


‘అతి’ ప్రదర్శన

జగన్‌ పర్యటన వాస్తవంగా జిల్లాలో గంట మాత్రమే. ఎటువంటి రోడ్‌ షోలకు, సభలకు, సమావేశాలకు పోలీసుల అనుమతి లేదు. అయినప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు పోలీసులు భారీ భద్రతనే కల్పించారు.అయితే వైసీపీ నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణను ప్రత్యేక టాస్క్‌గా మార్చుకుని తీసుకువచ్చారు. జగన్‌ కూడా రోడ్డుపై ఉన్న ఒకరిద్దరు జనం ఉన్నా.. వాళ్లందరికీ అభివాదం చేస్తూ.. వాహనం ఆపుతూ... వెళ్తూ ఆరుగంటల పాటు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు సమయం తీసుకున్నారు.


ధర్మాన నచ్చజెప్పినా..

జైలు వద్దకు మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ముందుగా చేరుకున్నారు. సీదిరిని పరామర్శించి జగన్‌ రాక కోసం చూస్తూ.. బొత్స అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడకు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వచ్చారు. జైలు బయట కూర్చుని జగన్‌ కోసం ఎదురుచూశారు. సాయంత్రం నాలుగు కావస్తుండటంతో ధర్మాన.. జైలు ముందరే మీడియా సమక్షంలో జగన్‌కు ఫోన్‌ చేశారు. ‘ములాఖత్‌ సమయం 4.30 గంటలకు ముగిసిపోతుంది. ఆ సమయానికి మీరు ఇక్కడ ఉండకుంటే జైలులోకి వెళ్లడం కుదరదు. ముందు ఇక్కడకు వచ్చి.. తిరుగుప్రయాణంలో ఇతర కార్యక్రమాలు పెట్టుకుందాం’ అని తెలిపారు. కానీ, జగన్‌ రోడ్డంతా అభివాదాలు చేసుకుంటూ నెమ్మదిగా సాయంత్రం 5 గంటల తర్వాత కాన్వాయ్‌లో జిల్లా జైలుకు వచ్చారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 07:22 AM