స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది: గవర్నర్ కంభంపాటి
ABN , Publish Date - Sep 30 , 2026 | 01:36 PM
స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. 100 స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు (Odisha Governor Kambhampati HariBabu) వ్యాఖ్యానించారు. 100 స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఒంగోలు అభ్యున్నతిలో భాగస్వాములైన ప్రతి పౌరుడికి హృదయపూర్వక అభినందనలు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లాతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధం, ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా నిలుపుతోందని చెప్పుకొచ్చారు.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మున్సిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలను ఈరోజు (బుధవారం) ఘనంగా నిర్వహించారు. ఒంగోలు మినీ స్టేడియంలో జరిగిన ఉత్సవాలకు వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ప్రజల మధ్యకు రావడం, తనకు మళ్లీ స్వగ్రామానికి వచ్చినంత ఆనందాన్ని కలిగిస్తోందని వెల్లడించారు. ప్రకాశం గడ్డ, తన చరిత్రతో, సంస్కృతితో, ప్రజల కార్యదక్షతతో, దేశానికి అందించిన మహనీయులతో ఎల్లప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉందని తెలిపారు.
ఒంగోలు చరిత్రను కేవలం పురపాలక ప్రస్థానంగా పరిమితం చేయలేం..
ఎగ్జిబిషన్‌లో ప్రకాశం జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధులందరి ఫొటోలు కూడా పెట్టారని... ఇది చాలా సంతోషకరమైన విషయమని గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. ఒంగోలు చరిత్రను కేవలం పురపాలక ప్రస్థానంగా పరిమితం చేయలేమని చెప్పారు. 2000 ఏళ్ల పైబడిన ఘనమైన చారిత్రక వారసత్వం కలిగిన ఈ పుణ్యభూమి, ప్రాచీన రాజవంశాల పాలనా వైభవానికి, నాగరికత వికాసానికి, సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచిందని ఉద్ఘాటించారు. కాల గమనంలో ఇది ఓ ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దుకుని, విద్య, వైద్యం, ప్రజాసేవ రంగాల్లోనూ తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం, ఆనాడు వెంకయ్య నాయుడు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఆ స్వచ్ఛత, తాగునీటి భద్రత, మురుగునీటి నిర్వహణ, జలవనరుల పరిరక్షణ, గృహ వసతి, వంటి కీలక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
సాంకేతిక ఆధారిత పరిపాలనకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు..
స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్, అమృత్ 2.0, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 వంటి కార్యక్రమాల ద్వారా, పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా అనేక చర్యలు చేపడుతోందని గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. అదే స్ఫూర్తితో పట్టణ స్థానిక సంస్థల ద్వారా పౌర సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం, సాంకేతిక ఆధారిత పరిపాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యాలకు అనుగుణంగా, పరిశుభ్రమైన, సురక్షితమైన, సుస్థిరమైన, ప్రజా కేంద్రిత నగరాల నిర్మాణం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అభివృద్ధికి అంతిమ లక్ష్యంగా భావించి, పట్టణాల సమగ్ర ప్రగతికి కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా అభినందించారు. మన రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్దేశించిందని గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచడమే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం: సీఎం చంద్రబాబు
తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News