Share News

నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టలో మంత్రి నారాయణ ప్రచారం.. ప్రజల ఘన స్వాగతం

ABN , Publish Date - Oct 30 , 2026 | 09:50 AM

నెల్లూరులోని సర్వేపల్లి కాలువ కట్టపై మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, అల్లుడు పునీత్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. శాశ్వత ఇంటి పట్టాలు మంజూరు చేసినందుకు స్థానికులు పూలతో స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.

నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టలో మంత్రి నారాయణ ప్రచారం.. ప్రజల ఘన స్వాగతం
Minister Narayana

నెల్లూరు, అక్టోబర్ 30: స్థానిక ఎన్నికల ప్రచార ముగింపుకు కౌంట్‌డౌన్ మొదలవటంతో మంత్రి నారాయణ స్పీడ్ పెంచారు. సతీమణి రమాదేవి, అల్లుడు పునీత్‌తో కలిసి సర్వేపల్లి కాలువ కట్టపై ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శాశ్వత ఇంటి పట్టాలు మంజూరు చేయించిన మంత్రికి కాలువ కట్టవాసులు బ్రహ్మరథం పట్టారు. లబ్ధిదారులు రోడ్డుపై పూలపాన్పు పరిచి కృతజ్ఞతాంజలులు తెలిపారు. మంత్రి దంపతులకు మహిళలు గుమ్మడికాయ దిష్టి తీసి, మంగళ హారతులిచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 2014లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, మంచినీటి ప్రాజెక్టుకు రూ.1100 కోట్లు నిధులు తెచ్చినట్లు చెప్పారు. రూ.940 కోట్లతో 90 శాతం పనులు చేశామని.. గత ప్రభుత్వం పదిశాతం పనులు చేయకపోవడంతో రూ.160 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. తమపై కోపంతో అభివృద్ధి పనులన్నీ అటకెక్కించేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే పనులన్నీ తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. భగత్ సింగ్ కాలనీ, సర్వేపల్లి కాలువ కట్ట వాసుల ఏళ్లనాటి సమస్యను పరిష్కరించామన్నారు.


2600 శాశ్వత పట్టాలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మరో 4500 పట్టాలను సంక్రాంతి కల్లా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ లాగా తాము నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని.. సంపూర్ణ హక్కు కల్పించే చట్టబద్ధమైన పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దని.. చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లతో పాటు, మేయర్‌గా రూప్ కుమార్‌ను ఆశీర్వదించాలని.. అభివృద్ధి కొనసాగింపుకు సహకరించాలని మంత్రి నారాయణ కోరారు.


ఇవి కూడా చదవండి..

కష్టాలు.. కన్నీళ్లు!

సాయికృష్ణ మృతి కేసులో అసలు దోషులెవరో తేల్చండి: సీబీఐకి తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 09:57 AM