కష్టాలు.. కన్నీళ్లు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:22 AM
పెనుగాలుల ఘోష తగ్గింది. వానల హోరు నెమ్మదించింది. అయినా, ‘అర్నబ్’ సృష్టించిపోయిన బీభత్సం నుంచి మాత్రం రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి పంట దిగుబడి తగ్గుతుందనే దిగులు తీరుతుందని అన్నదాతలు ఆశించారు. కానీ, వారి ఆశలను తుఫాను నిండా ముంచేసింది.
లక్షల హెక్టార్లలో పంట నీటిలోనే..
చేతికొచ్చే దశలో వరికి అపార నష్టం
మోకాలిలోతు నీళ్లలో నానుతున్న చేలు
అన్నదాతకు ఘోష మిగిల్చిన ‘అర్నబ్’
సాగర పుత్రులకు కన్నీరు మిగిల్చిన ‘తీరం’
ఉత్తరాంధ్రకు ఇంకా తొలగని ముంపు
పై నుంచి వరదతో ఉగ్రంగా నదులు, గెడ్డలు
బాహుదా ఉగ్రరూపం.. ట్రాకులపైకి,
హైవేపైకి నీళ్లు..14 రైళ్లు రద్దు
ఒడిశాతో తెగిపోయిన సంబంధాలు
విద్యుత్ వ్యవస్థ స్తంభించడంతో
కుదుట పడని గోదావరి జిల్లాలు
ఇంకా అంధకారంలోనే గ్రామాలు
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్): పెనుగాలుల ఘోష తగ్గింది. వానల హోరు నెమ్మదించింది. అయినా, ‘అర్నబ్’ సృష్టించిపోయిన బీభత్సం నుంచి మాత్రం రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి పంట దిగుబడి తగ్గుతుందనే దిగులు తీరుతుందని అన్నదాతలు ఆశించారు. కానీ, వారి ఆశలను తుఫాను నిండా ముంచేసింది. తుఫాను తీరం దాటిందిగానీ, పంట పొలాల్లోకి భారీగా వచ్చి చేరిన నీరు ఇప్పటికీ విడవలేదు. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో ప్రమాదకరంగా పొంగి పొర్లిన వాగులు, గెడ్డలు గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి పారాయి.
దీంతో చేనేదో, ఊరేదో తెలియని పరిస్థితి! పై రాష్ట్రాల నుంచి వచ్చిపడుతున్న వరదతో నదులు ఉగ్రరూపం దాల్చుతుండటంతో గురువారం కూడా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చేతికొచ్చే దశలో వరిపంట లక్షలాది హెక్టార్లలో నీట మునగడంతో అన్నదాతలు కుమిలిపోతున్నారు. 3లక్షల హెక్టార్లకుపైగానే వరి దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు వేల సంఖ్యలో పడిపోయాయి. గాలులు తగ్గడం, వర్షం లేకపోవడంతో శిబిరాల్లోని బాధితులు స్వస్థలాలకు వెళుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా : 261 గ్రామాల్లో 1.83 లక్షల ఎకరాల్లో వరి పంట నేలపాలైంది. ఉద్యాన పంటలకు సంబంధించి 52 గ్రామాల్లో దాదాపు 810 ఎకరాల్లో కొబ్బరి, అరటి, బొప్పాయి, పసుపు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. 4,720 ఎకరాల్లో ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. దీనివల్ల నష్టం 70.46 కోట్లు ఉండవచ్చునని భావిస్తున్నారు.
శ్రీకాకుళం: బాహుదా నదితోపాటు భీమ సముద్రం, పద్మాపురం గెడ్డలు పొంగి ప్రవహించడంతో 21,590.64 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. అత్యధికంగా 21,538.64 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లగా, మందస, రణస్థలం మండలాల్లో 52 హెక్టార్లలో పత్తి పంట దెబ్బతింది. 383.80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 245.765 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు పాడవ్వగా.. 32 భారీవృక్షాలు నేలకూలాయి.
విజయనగరం: 211 కిలోమీటర్లకుపైగా రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. 298 విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, 51 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. తిమ్మరాజు చెరువుకు గండి పడటంతో వరి పొలాలు మునిగిపోయాయి. సారిక-జొన్నవలస మధ్య రాకపోకలు స్తంభించాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే బీటీ రహదారి పలుచోట్ల కోతకు గురై పగుళ్లు ఏర్పడ్డాయి. 3,143 హెక్టార్లలో వరి, ఎనిమిది హెక్టార్లలో జొన్న, 24 హెక్టార్లలో పత్తిపంట దెబ్బతిన్నదని, రహదారుల నష్టం రూ.62 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండలో ఓనిగెడ్డ, రావాడగెడ్డ, జంపరకోటగెడ్డలు ఉప్పొంగడంతో పొలాలు నీటమునిగాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 365 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్‌శాఖకు రూ.28 లక్షలు, ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా.
అనకాపల్లి: 3,139 హెక్టార్లలో వరి, సుమారు 19 హెక్టార్లలో చెరుకు నీట మునిగింది. మొత్తం 9,089 మంది రైతులు నష్టపోయారు. ఈదురుగాలులకు జీడి, మామిడి, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ నష్టాన్ని నమోదుచేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
ఏలూరు జిల్లా : 40,440 ఎకరాల్లో వరి దెబ్బతింది. ఇప్పటికీ 38,771 ఎకరాల్లో పంట ముంపులోనే ఉంది. 243 గ్రామాలకు చెందిన 19,343 మంది రైతులు పంటలు నష్టపోయారు. గాలులు తీవ్రతకు 440ఎకరాలకు పైగా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. భారీవర్షాల కారణంగా 259.127 కిలోమీటర్లు మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయని, దీనినష్టం రూ.168.84 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. జిల్లాలో ఇంకా చాలా మంది పల్లపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలలోనే ఉన్నారు.
చకచకా సహాయక చర్యలు.. ‘అర్నబ్’ అపారంగా దెబ్బతీసిన పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులపై విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన తీర ప్రాంతవాసులు గురువారం ఊపిరి పీల్చుకున్నారు. గాలులు తగ్గడం, వర్షం లేకపోవడంతో వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సముద్రం శాంతించింది. పునరావాస కేంద్రాల నుంచి గ్రామస్థులు ఇళ్లకు తిరిగి వెళ్లారు. రాకపోకలు పునరుద్ధరించడంతో రోడ్లు సందడిగా కనిపించాయి. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సహకారంతో చెట్ల తొలగింపు పనులను వేగవంతం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జమ్మడుగూడ జంక్షన్, మేకవ, పులిపుట్టి మార్గాల్లో చెట్లు కూలిపోవడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తొలగింపు చర్యలు చేపట్టాయి. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడి లారీలు, బస్సులు, ఇతర వాహనాలు అక్కడే నిలుపుదల చేసి ప్రమాదం జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఒడిశాలోని సుర్లారోడ్, పలాస వద్ద లక్ష్మిపురం టోల్‌ప్లాజా నుంచి వాహనాల రాకపోకలు నిలిపేశారు. జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం బాహుదా నదీ ప్రవాహ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన నీటిని మళ్లించే చర్యలు చేపడుతున్నారు.