ఉప్పొంగుతున్న జలాశయాలు
ABN , First Publish Date - 2023-07-22T00:50:34+05:30 IST
జిల్లావ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. నాలుగు రోజుల పాటు ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి.
ఎడతెగని వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు
మత్తడి పోస్తున్న చెరువులు.. రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేత
పలు చోట్ల కూలిన ఇళ్లు, విద్యుత్ స్తంభాలు
జిల్లాలో 6.3 మి.మీ సగటు వర్షపాతం
జనగామ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. నాలుగు రోజుల పాటు ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. రెండు రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక ప్రాంతాల్లో చెరువులు, వాగులు మత్తళ్లు దుంకుతున్నాయి. జిల్లా అంతటా మోస్తరు వర్షాలు పడడంతో పై నుంచి వస్తున్న నీటితో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో చాలా వరకు చెరువులు పూర్తిగా నిండి మత్తడి పడుతున్నాయి. పలు చోట్ల వాగుల ప్రవాహం ఊపందుకుంది. కొన్ని ప్రాంతాల్లో పాత ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రోడ్లపై చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది.
రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేత
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని పలు రిజర్వాయర్లకు నీరు భారీగా వచ్చి చేరుతోంది. జిల్లాలో 6 రిజర్వాయర్లు ఉండగా నర్మెట్ట మండలం గండిరామవరం, జనగామ మండలం చీటకోడూరు రిజర్వాయర్ గేట్లను నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం ఎత్తేశారు. గండిరామవరం రిజర్వాయర్ నీటి సామర్థ్యం 400 మిలియన్ క్యుబిక్ అడుగులు, చీటకోడూరు సామర్థ్యం 300.25 మిలియన్ క్యుబిక్ అడుగులు కాగా ఈ రెండు రిజర్వాయర్లు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తారు. చీటకోడూరు రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో జనగామ నుంచి పాలకుర్తికి రాకపోకలు బంద్ కానున్నాయి. రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు లింగాలఘణపురం మండలం పటేల్‌గూడెం వద్ద కాజ్‌వేపై ప్రవహిస్తుంటుంది. దీంతో రాకపోకలను నిలిపివేస్తారు. ఇక చీటకోడూరు నీళ్లు శనివారం ఉదయం వరకు పటేల్‌గూడెం కాజ్వే వరకు చేరుకోనున్నాయి. దీంతో వాహనాలను రాకపోకలను నిలిపివేసి దారి మళ్లించాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 797 చెరువులు, కుంటలు ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు 151 చెరువులు పూర్తిగా నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. జిల్లాలో 132 చెరువులు 25 శాతం, 266 చెరువులు 25-50 శాతం, 132 చెరువులు 50-75శాతం, 116 చెరువులు 75-100 శాతం నిండగా 151 చెరువులు పూర్తిగా నిండాయి.
కూలిన ఇళ్లు, చెట్లు.. దెబ్బతిన్న రోడ్లు
వర్షాల కారణంగా జిల్లాలో పటు చోట్ల ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. ఇప్పటి వరకు 11 చోట్ల రోడ్లు దెబ్బతినగా 12 చోట్ల పాత ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, తీగలపై చెట్లు కూలడంతో జిల్లాలో 18 చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల మట్టి రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో వ్యవసాయబావుల వద్దకు వెళ్లే రైతులు ఇబ్బందులకు గురయ్యారు. జనగామ మండలం గోపిరాజుపల్లి, బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లి వద్ద మట్టిరోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలకు బంద్ అయ్యాయి. జనగామ మండలం శామీర్‌పేట వద్ద జనగామ- సిద్ధిపేట ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ చెబుతుండడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లాలో క్షేత్రస్థాయిలోని అధికారులతో కలెక్టర్ శివలింగయ్య శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్‌సింగ్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి సూచించారు. చెరువులు, కుంటల వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కాజ్‌వేల వద్ద ప్రవాహ తాకిడిని అంచనా వేస్తూ అవసరమైతే వాహనాల రాకపోకలను దారి మళ్లించాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు.
జిల్లాలో 6.3 మి.మీ సగటు వర్షపాతం
జిల్లావ్యాప్తంగా శుక్రవారం 75.1 మి.మీ వర్షం పడ గా సగటు వర్షపాతం 6.3 మి.మీగా నమోదైంది. జనగామ మండలంలో 22.9 మి.మీ, బచ్చన్నపేట మండలంలో 10.6 మి.మీ, లింగాలఘనపురం మండలంలో 7 మి.మీ, తరిగొప్పుల మండలంలో 6.3 మి.మీ, పాలకుర్తి మండలంలో 5.9 మి.మీ, నర్మెట్ట మండలంలో 5 మి.మీ, దేవరుప్పుల మండలంలో 4.7 మి.మీ, స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో 3.7 మి.మీ, కొడకండ్ల మండలంలో 3 మి.మీ, రఘునాథపల్లి మండలంలో 2.3 మి.మీ, జఫర్ఘడ్ మండలంలో 1.9 మి.మీ, చిల్పూరు మండలంలో 1.8 మి.మీ వర్షం కురిసింది.