Share News

తుంగభద్రకు నీటి గండం

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:20 PM

తుంగభద్ర ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కళ్యాణ కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, అనంతపురం, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, గద్వాల తదితర జిల్లాల రైతుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం పరిధిలోని రైతులు ఇప్పటికే వరి, మిర్చి తదితర పంటలను విస్తారంగా సాగుచేశారు.

తుంగభద్రకు నీటి గండం
Tungabhadra Dam

  • నవంబరు ఆఖరు వరకు సాగునీరు ఇవ్వాలి

  • పంటచేతికొచ్చే వేళ రైతుల్లో గుబులు

  • పరిశ్రమలకు కాదు.. పంటలకు ప్రాధాన్యమివ్వండి

  • తుంగభద్ర బోర్డుపై రైతుల ఆగ్రహం

బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కళ్యాణ కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, అనంతపురం, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, గద్వాల తదితర జిల్లాల రైతుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం పరిధిలోని రైతులు ఇప్పటికే వరి, మిర్చి తదితర పంటలను విస్తారంగా సాగుచేశారు. ఈ పంటలు చేతికి రావాలంటే కనీసం నవంబరు నెలాఖరు వరకు జలాశయం నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆగస్టు 11న జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో 90 రోజుల పాటు అంటే నవంబరు 11వరకు మాత్రమే నీరు ఇస్తామని నిర్ణయించారు.


ప్రస్తుత పరిస్థితుల్లో నవంబరు 11కే హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు నీటి సరఫరా నిలిపివేస్తే పంటలు ఎండిపోయి ఎకరానికి రూ.50వేల వరకు నష్టం వాటిల్లుందుని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో పంట చేతికొచ్చే దశలో నీరు ఆపితే కోలుకోలేని దెబ్బతగులుతుందని వాపోతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 59 టీఎంసీల నీరు నిలువ ఉంది. మల్నాడు ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో డ్యామ్‌కు వరద ప్రవాహం నిలిచిపోయింది.


tb-dam1.jpgగత ఏడాది క్రస్ట్‌గేట్ల మరమ్మతుల కారణంగా వేసిన పంటను కోల్పోయిన రైతులు, ఈసారైనా పంట దక్కుతుందని ఆశపడ్డారు. కానీ నీటి నిల్వలు తగ్గుతుండడంతో వారిలో మరింతర భయాన్ని నింపుతోంది. మరోవైపు కర్మాగారాలకు, పరిశ్రమలకు అక్రమంగా మితిమీరి నీటిని కేటాయిస్తున్నారని, జనరేటర్లు పెట్టి నీటిని తోడేస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి దుర్వినియోగాన్ని వెంటనే అరికట్టి పరిశ్రమలకు ఇచ్చే నీటిని నిలిపివేసి రైతుల పంటలకు మళ్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


నవంబరు చివరి వరకు నీరు అందకపోతే 60వేల ఎకరాల్లో పంటలు నాశనమవడమే కాకుండా, మిర్చి కోల్డ్‌ స్టోరేజీలు, అనుబంధ రంగాలు కూడా తీవ్రనష్టాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరిస్తున్నారు. బళ్లారి జిల్లాధికారి అధ్యక్షతన స్థానిక ప్రజా ప్రనిధులు, తుంగభద్ర బోర్డు ఇంజనీర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక..

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 01:20 PM