Share News

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:50 PM

ఫ్రాంక్‌ఫర్ట్‌-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక రావడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయించిన అధికారులు.. ముమ్మర తనిఖీలు ప్రారంభించారు.

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్
Air India

న్యూఢిల్లీ: ఫ్రాంక్‌ఫర్ట్‌-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ రోజు (బుధవారం) ఉదయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయించిన అధికారులు.. ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం AI2030 వస్తోంది.


విమానం ముంబై ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్‌లో ఉండగా.. పైలట్ ‘స్క్వాక్ కోడ్ 7500’ను యాక్టివేట్ చేశారు. ఈ కోడ్‌ను అంతర్జాతీయ విమానయానంలో హైజాక్ లేదా చట్టవిరుద్ధ జోక్యాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. ఈ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి, అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను, సిబ్బందిని కిందకు దించారు. అనంతరం దానిని ప్రత్యేక ప్రాంతానికి తరలించి తనిఖీలు చేపట్టారు.


విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం (ATS) అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, అసలు హైజాక్ హెచ్చరికకు కారణమేంటి? విమానంలో ఏదైనా అనుమానాస్పద వస్తువు గుర్తించారా? అనే అంశాలపై అధికారుల విచారణ కొనసాగుతోంది. తనిఖీలు ఎప్పుడు పూర్తవుతాయి? విమాన ప్రయాణం తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

సీజేపీకి షాక్.. సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలకు జ్యుడీషియల్ కస్టడీ..

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Oct 14 , 2026 | 12:50 PM