Share News

ఫేస్‌బుక్ లైవ్‌లో హత్య.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్..

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:17 AM

డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసులో ప్రధాన నిందితుడు అశ్వనీ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని సలాసర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో హత్య.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్..
Parvinder Singh Jhota Case

చండీగఢ్: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసులో ప్రధాన నిందితుడు అశ్వనీ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని సలాసర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో అశ్వనీకి చెందిన మెడికల్ షాపులో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఝోటాకు సమాచారం అందింది. తన సహచరులతో కలిసి అక్కడికి చేరుకున్న ఆయన.. ఓ వృద్ధుడికి డ్రగ్స్ విక్రయించడంపై అశ్వనీని నిలదీశారు. ఆగ్రహానికి గురైన నిందితుడు.. ఝోటాపై కాల్పులకు తెగపడ్డాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.


అయితే, ఈ ఘటనను ఝోటా ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రసారం చేయడంతో హత్యకు సంబంధించిన దృశ్యాలన్నీ అందులో రికార్డయ్యాయి. దాదాపు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తొలి నాలుగు నిమిషాల పాటు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత నిందితుడు కాల్పులు జరపడంతో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అశ్వనీ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడికి సహకరించిన వ్యక్తిని పోలీసులు నిన్ననే అరెస్టు చేశారు. కాగా, హత్య అనంతరం రాజస్థాన్‌లోని సలాసర్‌కు అశ్వనీ కుమార్ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పంజాబ్, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి అతడిని అరెస్టు చేశారు.


మాన్సా, పరిసర ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాల విక్రయాలను వ్యతిరేకిస్తూ పర్వీందర్ సింగ్ ఝోటా ఉద్యమం చేస్తున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కొన్నేళ్లుగా ప్రచారం చేస్తున్న ఆయన.. పలు వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయనకు ఫేస్‌బుక్‌లో 24 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఝోటా హత్యతో ఆయన అభిమానులు, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీజేపీకి షాక్.. సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలకు జ్యుడీషియల్ కస్టడీ..

భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి, 15 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది

Updated Date - Oct 14 , 2026 | 11:33 AM