సీజేపీకి షాక్.. సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలకు జ్యుడీషియల్ కస్టడీ..
ABN , Publish Date - Oct 14 , 2026 | 10:06 AM
కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలకు ఢిల్లీ కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలతో అరెస్టయిన వారిని బుధవారం మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసును విచారించిన మేజిస్ట్రేట్ వారికి ఐదు రోజుల కస్టడీ విధించారు.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలకు ఢిల్లీ కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. జంతర్ మంతర్ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారంటూ నిన్న వారిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈరోజు (బుధవారం) ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ వారికి ఐదు రోజుల కస్టడీ విధించారు. దీంతో సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను తీహార్ జైలుకు తరలించారు.
మరోవైపు, సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాతో పాటు ఉన్న మరో సీజేపీ నేత అజింక్య షిండేను బెయిల్పై విడుదల చేశారు. రూ.5వేల పూచీకత్తు సహా ఏడాది పాటు ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే షరతుపై ఆయన్ని విడుదల చేశారు. కాగా, ఓటు చోరీ, సర్ (SIR) ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహించాలంటూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా సీజేపీ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. వారంతా అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద పెద్దఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే, ఢిల్లీలో పోలీసులు భారీగా మోహరించి అడుగడుగునా వారిని అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతానికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టింది. దీంతో 13వ తేదీన జంతర్ మంతర్ వద్ద తాళం వేసి ఉన్న గేట్లను ఎక్కినందుకు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకా, అజింక్య షిండే సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ రోజు ఉదయం వారిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా నిందితులు ప్రజాశాంతికి భంగం కలిగించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. దీంతో వారిని ఐదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
పుణె శివాలయంలో బాలికపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్..
భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి, 15 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది