Share News

క్లీన్‌ ఎనర్జీ.. కేరాఫ్‌ ఏపీ..!

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:40 AM

స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మరో సౌదీ అరేబియాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేశ్‌ అన్నారు.

క్లీన్‌ ఎనర్జీ.. కేరాఫ్‌ ఏపీ..!

  • స్వచ్ఛ ఇంధనంలో సౌదీ అరేబియా స్థాయికి

  • త్వరలోనే విదేశాలకు ఏపీ స్వచ్ఛ ఇంధనం ఎగుమతి

  • పారిశ్రామిక వర్గాల్లో విశ్వసనీయతను పునరుద్ధరించాం

  • అందుకే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి: లోకేశ్‌

  • 800 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన

  • కర్నూలు జిల్లా హోసూరు వద్ద 400 మెగావాట్ల సోలార్‌ పవర్‌..

  • అనంతపురం జిల్లా కనేకల్లు వద్ద 400 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు

  • టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌, సుజ్లాన్‌ గ్రూప్‌ ఏర్పాటు

కర్నూలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మరో సౌదీ అరేబియాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేశ్‌ అన్నారు. టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (టీపీఆర్‌ఈఎల్‌) సుజ్లాన్‌ గ్రూప్‌తో కలిసి సుమారు రూ.5,750 కోట్ల వ్యయంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌తో కలసి ఆయన గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు బహిరంగ సభలో మంత్రి లోకేశ్‌ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రూక్‌ఫీల్డ్‌, బ్లాక్‌స్టోన్‌, బ్లాక్‌రాక్‌, ఈక్యూటీ, టీపీజీ.. వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. టాటా పవర్‌, సుజ్లాన్‌, రెన్యూ, ప్రీమియర్‌ ఎనర్జీస్‌, ఏసీఎంఈ.. వంటి భారతీయ దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని వివరించారు.


గతేడాదితో పోలిస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే ఏపీలో పునురుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందన్నారు. పారిశ్రామిక వర్గాల్లో విశ్వసనీయతను పునరుద్ధరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పునరుత్పాదక ఇంధన రంగం అస్తవ్యస్థంగా ఉండేదన్నారు. ఒకసారి దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం రాత్రికి రాత్రే సాధ్యం కాదన్నారు. పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని పెంపొందిస్తూ రావడంతో రాష్ట్రానికి పరిశ్రమలు వరుస కడుతున్నాయని పేర్కొన్నారు. అందుకు కరువు సీమలో టాటా సంస్థ స్థాపించే భారీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టే నిదర్శనమన్నారు.


4వేల మందికి ఉపాధి..

సీఎం చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా 160 గిగావాట్ల (జీడబ్ల్యూ) క్లీన్‌ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని లోకేశ్‌ వివరించారు. క్లీన్‌ ఎనర్జీ టెక్నాలజీలకు రాష్ట్రాన్ని గ్లోబల్‌ ప్రొడ్యూసర్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. టాటా రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు రూ.5,750 కోట్ల పెట్టుబడితో పత్తికొండ నియోజకవర్గం హోసూరు వద్ద 400 మెగావాట్ల సోలార్‌ పవర్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు వద్ద 400 మెగావాట్ల విండ్‌ పవర్‌ కలిపి మొత్తం 800 మెగావాట్ల హైబ్రిడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 4 వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. 1,100 మంది రైతు కుటుంబాలకు మూడు దశాబ్దాల పాటు కౌలు ఆదాయం వస్తుందన్నారు.


క్లీన్‌ ఎనర్జీని ఎగుమతి చేస్తాం

ప్రపంచ స్థాయి ఓడరేవులు కలిగిన ఏపీ... గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా ఎగుమతుల్లో భారత్‌కు ముఖద్వారంగా మారే అవకాశాలున్నాయని లోకేశ్‌ వివరించారు. అతి త్వరలోనే రాష్ట్రంలో ఉత్పత్తయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని తీసుకెళ్లే ఓడలు... యూరప్‌, జపాన్‌, కొరియా సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ ప్రయాణిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం.. ఐఐటీ తిరుపతి, న్యూసౌత్‌వేల్స్‌ యూనివర్సిటీ (ఆస్టేలియా) సహకారంతో సోలార్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ టెక్నాలజీ కోసం ఏర్పాటుచేస్తున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌తో కలసి పనిచేయాలని టాటా పవర్‌ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పవన విద్యుత్‌ రంగంలో సుజ్లాన్‌ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని కొనియాడారు. టాటా సంస్థతో ఏపీ అనుబంధం బలంగా ఉందన్నారు. టాటా పవర్‌ సీఈవో, ఎండీ ప్రవీర్‌ సిన్హా మాట్లాడుతూ... దేశంలో క్లీన్‌ ఎనర్జీని వేగంగా పెంచాలనేది టాటా సంస్థ లక్ష్యమని చెప్పారు. సుజ్లాస్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ గిరీశ్‌ తాంతి మాట్లాడుతూ... 2030 నాటికి 72 గిగావాట్లకుపైగా పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేయడం తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ సీఈవో, ఎండీ సంజయ్‌ బంగా, సుజ్లాన్‌ వైస్‌ చైర్మన్‌ గిరీశ్‌ తాంతి, మంత్రి టీజీ భరత్‌, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తదితరులు పాల్గొన్నారు.


పార్టీ లైన్‌ దాటితే వేటు తప్పదు: లోకేశ్‌

‘‘కార్యకర్తలకు టీడీపీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది. పార్టీకి వారే అధినేతలు. బాధ్యతగా పనిచేసే వాళ్లను గౌరవిస్తాం.. పదవులు ఇస్తాం. పార్టీ లైన్‌ దాటితే ఎంతటివారినైనా సరే ఉపేక్షించేది లేదు.. వేటు తప్పదు’’ అని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన ఆదోని నియోజకవర్గం క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, నియోజవకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుతో కలసి ఈ సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ... రాష్ట్ర నాయకత్వం కూటమి ధర్మాన్ని విధిగా పాటిస్తుందని, బూత్‌ స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి నాయకుల వరకు దాన్ని పాటించాల్సిందేనని అన్నారు.


థ్యాంక్యూ లోకేశ్‌ సార్‌!

మంత్రిని కలసిన పునర్విక తల్లిదండ్రులు

‘‘లోకేశ్‌ సార్‌.. థ్యాంక్యూ..! మాకు అండగా నిలబడి మా పాపకు పునర్జన్మను ప్రసాదించారు. మీ రుణం తీర్చుకోలేనిది’’ అంటూ మంత్రి లోకేశ్‌కు చిన్నారి పునర్వికశ్రీ తల్లిదండ్రులు జంపాల సురేశ్‌, పుష్పావతి ధన్యవాదాలు తెలిపారు. పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి వచ్చిన లోకేశ్‌ను వారు కలిశారు. పునర్వికశ్రీకి రూ.16 కోట్లు ఖరీదైన ఇంజెక్షన్‌ వేసిన తరువాత ఆరోగ్యం మెరుగుపడిందని, పాప శరీరంలో కదలికలు వచ్చాయని వివరించారు. చిన్నారి ఆరోగ్యం, యోగక్షేమాలను లోకేశ్‌ అడిగి తెలుసుకున్నారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 07:40 AM