Share News

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 08:08 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రస్తుత దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణకు డిమాండ్ చేశారు.

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు
Srisailam Ghee Controversy

నంద్యాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనే అనుమానాలు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ అంశంపై దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్ర ఆరోపణలు చేస్తూ పూర్తిస్థాయిలో సిట్(SIT) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం వంటి పరమ పవిత్ర క్షేత్రంలో ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.


11 నెలల పాటు కల్తీ నెయ్యి సరఫరా.?

ట్రస్ట్ బోర్డు సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022 నుంచి 2023 సంవత్సరాల మధ్య 11 నెలల పాటు శ్రీశైలం దేవస్థానానికి రాజేశ్ కార్పొరేషన్ ద్వారా నెయ్యి సరఫరా జరిగిందని తెలిపారు. ఆ సమయంలో నెయ్యి కల్తీ జరిగిందనే అనుమానాలు బలంగా ఉన్నాయని, ఈ విషయంపై అప్పట్లో సరైన పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు.

రాజేశ్ కార్పొరేషన్‌పై అనుమానాలు..

రాజేశ్ కార్పొరేషన్‌కు సొంత డైరీ ఫామ్ కూడా లేదని.. అయినప్పటికీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఎలా దక్కిందన్నది పెద్ద ప్రశ్నగా మారిందని ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలిపారు. అంతేకాకుండా భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా జరిగిందనే సమాచారం వెలుగులోకి రావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు.


తిరుమల కల్తీ నెయ్యి కేసుతో పోలిక..

ఈ సందర్భంగా తిరుమల ఉదంతాన్ని ప్రస్తావించారు ట్రస్ట్ బోర్డు సభ్యులు. తిరుమలలో కల్తీ నెయ్యి వాడారని సిట్ అధికారులు ఇప్పటికే నిగ్గు తేల్చినప్పటికీ.. వైసీపీ నేతలు అనవసరంగా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు వాస్తవాలు బయటపడుతున్నా.. మరోవైపు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

భారీ అక్రమాలు..

ఈ వ్యవహారంలో మరో కీలక అంశాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రస్తావించారు. మార్కెట్‌లో కిలో నెయ్యి ధర సుమారు రూ.1000లు ఉన్న సమయంలో కేవలం రూ.489లకు కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక భారీ అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కాంట్రాక్ట్‌ను అప్పట్లో ఇచ్చిన దేవస్థానం అధికారుల పాత్రనూ సిట్ విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు.


భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి..

శ్రీశైలం దేవస్థానం కోట్లాది హిందువుల విశ్వాసాలకు కేంద్ర బిందువని.. అక్కడ తయారు చేసే ప్రసాదాలు, నైవేద్యాల్లో కల్తీ జరిగితే భక్తుల మనోభావాలకు తీవ్ర భంగం కలుగుతుందని ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల పవిత్రతతో రాజకీయం చేయడం అనైతికమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన సనాతన ధర్మం, దేవాలయాల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతలు మాత్రం కుల, మత రాజకీయాలు చేస్తూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు లేనిపోని దారుణాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.


భక్తుల విశ్వాసాలే ప్రథమ ప్రాధాన్యం

దేవాలయాల విషయంలో రాజకీయాలకు తావులేకుండా, భక్తుల విశ్వాసాలను కాపాడటమే ప్రభుత్వాల బాధ్యత అని ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. నిజాలు బయటకు రావాలంటే సిట్ విచారణ ఒక్కటే మార్గమని, అప్పుడే ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయని వారు అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 09:23 AM