జగన్ హయాంలో నీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.. మంత్రి నిమ్మల ధ్వజం
ABN , Publish Date - Jun 15 , 2026 | 07:15 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రాజెక్టుల పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు.
కర్నూలు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రాజెక్టుల పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. వైసీపీ సర్కార్ అలసత్వంతో నీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని ఆగ్రహించారు. ఈరోజు (సోమవారం) కర్నూలు ఎంపీ, జిల్లా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. మొదటి ఏడాదిలోనే హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి, 248 రోజుల్లో 52 టీఎంసీలు తరలించి, రాయలసీమ జిల్లాల్లో రిజర్వాయర్లు, చెరువులను నింపామని పేర్కొన్నారు. నేటికీ రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా ఉన్నాయంటే చంద్రబాబు వాటర్ మేనేజ్‌మెంట్ వల్లనే సాధ్యమైందని ఉద్ఘాటించారు.
వాటి పనులు వేగంగా పూర్తి చేస్తాం..
కర్నూలు పశ్చిమ ప్రాంతం సాగు, తాగునీరుపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సూచించారని మంత్రి నిమ్మల తెలిపారు. కీలకమైన గుండ్రేవుల, ఆర్డీఎస్ రైట్ కెనాల్, గాజుల దిన్నె, వేదవతి, గురురాఘవేంద్ర ప్రాజెక్టులు పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నీటి ద్వారా 68 చెరువులు నింపేందుకు ఇప్పటికే రూ.228 కోట్లు ఖర్చు చేసి, 98 శాతం పనులు పూర్తి చేసి 67 చెరువులకు నీరందించామని తెలిపారు. జిల్లాలో 68 ట్యాంకుల పథకంలో భాగమైన జొన్నగిరి ట్యాంకుకు పైప్‌లైన్ నిర్మాణంపై అంచనాలు రూపొందిస్తున్నామని వివరించారు. గాజుల దిన్నె ప్రాజెక్టుకు భూసేకరణ, గేట్ల అమరిక, పెంచిన ఒక టీఎంసీ నీటి నిల్వకు అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. 36 ప్రాధాన్యం గల ప్రాజెక్టుల్లో వేదవతి లిప్ట్ స్కీంను 2028 నాటికి పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.
ఆ బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించాం
వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం డీపీఆర్, అటవీ, పర్యావరణ అనుమతులు పొందే బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించామని మంత్రి నిమ్మల తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని నగరడోన రిజర్వాయర్‌లో ఆగిన పనులను మళ్లీ చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించేలా సంప్రదింపులు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక మరమ్మతుల కోసం ప్రణాళిక రూపొందించి, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సాగు, తాగు నీరందించేలా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
మోటార్లు దొంగలించినా పట్టించుకోలేదు..
జగన్ హయాంలో గురు రాఘవేంద్ర లిఫ్ట్ స్కీమ్‌లో మోటార్లు దొంగలించినా పట్టించుకోలేదని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. గోరకల్లు రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయాలని నిపుణులు చెప్పినా వినకుండా జగన్ హయాంలో పనులను ప్రీ క్లోజర్ చేసిందని ఆగ్రహించారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మతులకు గొడ్డలి పార్టీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రూ.203 కోట్లతో శ్రీశైలం డ్యాం మరమ్మతులు చేపట్టామని ప్రస్తావించారు. గోరకల్లు రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నీటిని నింపడానికి రూ.53 కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు. ఒక్క సీజన్‌లోనే తుంగభద్ర డ్యాంకు రూ.51 కోట్లు ఖర్చుచేసి, 33 కొత్త గేట్లు అమర్చడం అరుదైన రికార్డు అని వ్యాఖ్యానించారు. ఈనెలాఖరులో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు తుంగభద్ర డ్యాం గేట్లను ప్రారంభించబోతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు గ్రాండ్ వెల్‌కమ్.. ఎన్ఆర్ఐల స్వాగతం
ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్‌లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రపోయారు: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News