Share News

విజయసాయిరెడ్డి టీడీపీపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి.. ఎంపీ శివనాథ్ ధ్వజం

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:07 PM

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ2గా ప్రసిద్ధుడైన ఆయన ఉనికి చాటుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

విజయసాయిరెడ్డి టీడీపీపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి.. ఎంపీ శివనాథ్ ధ్వజం
TDP MP Kesineni Shivnath

విజయవాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (TDP MP Kesineni Shivnath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ2గా ప్రసిద్ధుడైన ఆయన ఉనికి చాటుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలే నైజంగా విజయసాయిరెడ్డి పని చేస్తారనేది జగమెరిగిన సత్యమని.. అయినా... ఇదే విషయాన్ని ప్రతినిత్యం చాటుకుంటూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (ఆదివారం) విజయవాడలో మీడియాతో ఎంపీ శివనాథ్ మాట్లాడారు. తాజాగా విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు పోటీ వెనుక టీడీపీ ఉందని.. మరో తప్పుడు ప్రచారాన్ని ఆయన తలకెత్తుకున్నారని మండిపడ్డారు.


విజయసాయి ప్రయత్నాలు ఫలించవు..

ఏబీ వెంకటేశ్వరరావు ఒక రిటైర్డ్ అధికారి అని.. ఆయనకు తెలుగుదేశానికి ఏం సంబంధం..? అని ఎంపీ శివనాథ్ ప్రశ్నించారు. మేయర్‌గా వ్యక్తిగత హోదాలో ఏబీవీ పోటీ చేసుకుంటుంటే... ఆ విషయాన్ని తెలుగుదేశానికి విజయసాయిరెడ్డి ఆపాదించడం కుట్రేనని ఆగ్రహించారు. అయినా పన్నాగాలు, కుతంత్రాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీయడానికి విజయసాయి చేసే ప్రయత్నాలు ఫలించవని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2019 మధ్య బీజేపీ నుంచి టీడీపీని దూరం చేయాలని చాలా కుట్రలు చేశానని స్వయంగా చెప్పుకున్న సాయిరెడ్డి గురించి అందరికీ తెలుసునని అన్నారు.


కూటమిని విడగొట్టలేరు..

ఈసారి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూటమిని విడగొట్టలేరని.. తమ ఐక్యతను చెడగొట్టలేరని ఎంపీ శివనాథ్ తెలిపారు. అయినా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏ1 మాటలు నమ్మడానికి.. ఏ2 మాటలు వినడానికి సిద్ధంగా లేరని అన్నారు. విజయసాయి రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత బురద జల్లినా... కూటమి కలిసే ఉంటుందని స్పష్టం చేశారు. అంతా కలిసి విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని చోట్లా కూటమి విజయంతో విజయసాయి రెడ్డి వంటి వాళ్ల నోళ్లు పూర్తిగా మూయిస్తామని ఎంపీ శివనాథ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్‌ఈసీ

రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 03:44 PM