రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:19 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేళ చోటుచేసుకున్న ఘర్షణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా సీరియస్ అయ్యారు. రాయచోటి, పుంగనూరులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
విజయవాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేళ చోటుచేసుకున్న ఘర్షణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా సీరియస్ అయ్యారు. రాయచోటి, పుంగనూరులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమను కొన్నిరాజకీయ పార్టీల నేతలు కలిశారని.. ఆయా సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సమస్యలపై ఆయా జిల్లా ఎస్పీలతో తాము మాట్లాడామని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) విజయవాడలో పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులతో అనిల్ చంద్ర పునేఠా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
అల్లర్లు జరగకుండా చూడాలి..
పలు ప్రాంతాల్లో చాలా సీరియస్ పరిస్థితి ఉందని.. ఈ మేరకు స్థానిక ఎన్నికలకు సంబంధించి అల్లర్లు జరగకుండా చూడాలని అధికారులకు అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ఘర్షణలు జరిగితే అదనపు బలగాల సహకారంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. అర్హత ఉన్నా అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశించారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో పాటు ముగ్గురు మాత్రమే నామినేషన్ వేసే కేంద్రంలో ఉండాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యంగా కనిపిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఆ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తామని.. వేరే వాళ్లను వెంటనే అక్కడ నియమిస్తామని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
అభ్యర్థులు నామినేషన్ సజావుగా వేసేలా చర్యలు: ఐపీఎస్ అధికారి రాజకుమారి
స్థానిక ఎన్నికల సందర్భంగా అన్ని జిలాల్లో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామని ఐపీఎస్ అధికారి రాజకుమారి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించే భద్రత ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నిన్న పుంగనూరులో జరిగిన ఘటనల్లో అన్నమయ్య జిల్లా ఎస్పీ శాంతిభద్రతలను పర్యవేక్షించారని.. పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేశారని అన్నారు. నిన్న తమకు వచ్చిన వినతులను.. జిల్లా ఎస్పీలకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. ఆయా ఘటనల్లో బాధ్యులపై కేసులు పెట్టామని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే బైండోవర్ చేస్తామని అన్నారు. ఆయా రాజకీయ పార్టీల్లోని అభ్యర్థులు నామినేషన్ సజావుగా వేసేలా చర్యలు చేపట్టామని ఐపీఎస్ అధికారి రాజకుమారి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News