జగన్ బెల్స్ లా.. వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.. మంత్రి పార్థసారథి సెటైర్లు
ABN , Publish Date - May 01 , 2026 | 08:56 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బెల్స్‌లా... వైసీపీ గోబెల్స్ పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు.
కృష్ణా జిల్లా, పామర్రు, మే1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి (AP Minister Kolusu Parthasarathy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బెల్స్‌లా... వైసీపీ గోబెల్స్ పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఏపీలో ఏ గ్రామానికైనా తాము వస్తామని.. కూటమి ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం చేశామని 'జగన్ అండ్ కో'కు నిరూపించే దమ్ముందా? అని సవాల్ చేశారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు (శుక్రవారం) కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ చేశారు. పార్థసారథితో పాటు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగన్ అండ్ కోవి అసత్యాలు..
తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదలకు సేవలో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పేదలకు సేవలో రాష్ట్రవ్యాప్తంగా నేడు పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రత్యేక కార్యక్రమంగా భావిస్తూ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రతి నెల పేదలకు పింఛన్లు అందజేస్తున్నారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమలు అమలు చేయట్లేదని... వైసీపీ హయాంలోనే పేదలకు మంచి జరిగిందంటూ జగన్ అండ్ కో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
జగన్ మడమ తిప్పారు..
ప్రజలకు ఎవరు ఎక్కువ సంక్షేమం అందించారో.. ఆధారాలతో సహా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. అందరికీ అమ్మ ఒడి ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత... జగన్ మడమ తిప్పిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారని సెటైర్లు గుప్పించారు. జగన్ హయాంలో రోడ్లు అధ్వానంగా ఉండేవని.. రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. కూటమి పాలనలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్లు వేశామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు
ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన టైటాన్ సంస్థ
Read Latest AP News And Telangana News And International News And Telugu News