టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 30 , 2026 | 08:23 PM
టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని పేర్కొన్నారు.
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని పేర్కొన్నారు. భవిష్యత్ లక్ష్యాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి వ్యూహాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. విభజన నుంచి అభివృద్ధి వరకు ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు సీఎంకు వచ్చిన సందర్భంగా ఈరోజు (గురువారం) మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు ఆత్మీయ విందు సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ శాఖల్లో చక్కటి పనితీరు కనబరచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులనూ విందుకు సీఎం ఆహ్వానించారు.
‘డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్’ అనే పేరుతో సీఎం ఆత్మీయ విందు ఇచ్చారు. డిన్నర్ కంటే ముందు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రారంభం కాగానే చప్పట్లతో సీఎం చంద్రబాబుకు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవహరించారు. ఈ విందుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన, వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలను ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. సీఎం చంద్రబాబు డీఎన్ఏలోనే సంస్కరణలు ఉన్నాయని పయ్యావుల వ్యాఖ్యానించారు. విద్యుత్, ఓపెన్ స్కై పాలసీ, టెలికాం రంగం, ఐటీ, డ్రిప్ ఇరిగేషన్, పీపీపీ వంటి రంగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే సంస్కరణలు తీసుకువచ్చారని పయ్యావుల ప్రస్తావించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై ఈ సమావేశంలో సీఎం చర్చించారు.
ఎలాంటి ఇగోలకు పోకుండా సీఎం పనిచేస్తారు: మంత్రి లోకేశ్

డిన్నర్ విత్ రియల్ విన్నర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును మంత్రి నారా లోకేశ్ వివరించారు. ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసేందుకు మంత్రులు, అధికారుల వెంటపడి టాస్క్ పూర్తి చేయించే బాధ్యతలను సీఎం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. పరిపాలనలోనూ, రాజకీయాల్లోనూ ఎలాంటి ఇగోలకు పోకుండా పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. పెట్టుబడులను తీసుకువచ్చే విషయంలో, పారిశ్రామిక వేత్తలను కలిసే విషయంలో ఇగోలను పక్కన పెట్టి టీమ్ స్పూర్తితో పని చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో 1995-1999 పాలన గురించి చెబుతారని... ఇకపై 2024-29 పాలన గురించి చెప్పుకునేలా తాము పనిచేస్తామని పేర్కొన్నారు. మంత్రులు, అధికారులు ఒక టీంగా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. లక్ష్యాన్ని చేరుకున్న ప్రతీసారి మంత్రులకు సీఎం మరో కొత్త లక్ష్యాన్ని నిర్ధేశిస్తారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
రీసెర్చ్ సెంటర్లుగా యూనివర్సిటీలు..
రీసెర్చ్ సెంటర్లుగా యూనివర్సిటీలు పనిచేస్తాయని మంత్రి లోకేశ్ వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కోర్సులు తీసుకువస్తామని తెలిపారు. టెక్నాలజీ కాంపిటెన్సీ వచ్చేలా విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర యువతకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ నైపుణ్యాలు నేర్పిస్తామని వెల్లడించారు. ఉద్యోగాల కల్పనపై సమీకృత పోర్టల్ ద్వారా సమాచారం అందజేస్తామని అన్నారు. పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలు తీసుకువస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..
పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News