Share News

వియత్నాం ప్రమాద బాధితుల మృతదేహాల తరలింపు ప్రక్రియ ముమ్మరం

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:13 PM

వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

వియత్నాం ప్రమాద బాధితుల మృతదేహాల తరలింపు ప్రక్రియ ముమ్మరం
Vietnam Boat Accident

అమరావతి, జులై 12 (ఆంధ్రజ్యోతి): వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో (Vietnam Boat Accident) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఈ కష్టసమయంలో ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.


వియత్నం రాజధాని హనోయికి మృతదేహాలు..

దివంగత రవితేజ (హిందూపురం), శ్రీధర్ (కడప), జయలక్ష్మి (మచిలీపట్నం)ల భౌతికకాయాలకు సంబంధించి వియత్నాం ప్రభుత్వం, అక్కడి భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారిక లాంఛనాలను పూర్తి చేస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు. అన్ని అనుమతులు లభించిన అనంతరం మృతదేహాలు ఈ రాత్రికి వియత్నం రాజధాని హనోయికి చేరుకుంటాయని వివరించారు. మృతులతో పాటు అక్కడ చిక్కుకున్న మిగిలిన తెలుగువారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామని వివరించారు.


హైదరాబాద్‌ విమానాశ్రయానికి తరలించేందుకు ఏర్పాట్లు..

సోమవారం (జులై 13) నాటికి భారత ఎంబసీ అధికారులు ఎయిర్‌లైన్స్, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. అనంతరం భౌతికకాయాలను హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తారని పేర్కొన్నారు. విమాన ప్రయాణ షెడ్యూల్ ఖరారుతో పాటు స్వదేశానికి తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ, భారత రాయబార కార్యాలయం నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.


'ఈ-కేర్' పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలి..

హైదరాబాద్‌ విమానాశ్రయంలో భౌతికకాయాలను అప్పగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ 'ఈ-కేర్' పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పష్టం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులు భౌతికకాయాన్ని స్వీకరించే వ్యక్తి పేరు, మొబైల్ నంబర్, ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఫొటో ఐడీ) వివరాలను అత్యవసరంగా అందించాలని కోరారు. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ భవన్ బృందం వెంటనే వియత్నాంలోని భారత ఎంబసీకి పంపి, తదుపరి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఏపీ భవన్, ఎంబసీ అధికారులతో నిత్యం సీఎంవో సంప్రదింపులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు

యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 06:50 PM