Share News

జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:23 PM

ప్రపంచ జనాభా దినోత్సవం 2026 చరిత్రలో నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

విజయవాడ, జులై 11 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ జనాభా దినోత్సవం 2026 చరిత్రలో నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఈరోజు (శనివారం) విజయవాడలో నిర్వహించిన వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేషన్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విజయవాడలోని అంబేడ్కర్ కళావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ కార్యక్రమానికి వైద్యులు, వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. నేడు ఇది ఓ హిస్టారికల్ సమావేశమని తెలిపారు. ఇక్కడకు వచ్చిన పిల్లలే మన సంపద అని చెప్పుకొచ్చారు. యువత ఆశలను, ఆకాంక్షలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. నేడు జనాభా నియంత్రణ కాదని.. జనాభా సంరక్షణ నేటి నుంచే ప్రారంభం అవుతుందని ఉద్ఘాటించారు. ఒకప్పుడు తాను కూడా జనాభాను తగ్గించాలని ఆలోచన చేశానని పేర్కొన్నారు.


పేదరికం తగ్గించడానికి కొన్ని నిర్ణయాలు చేశాం..

ఆనాడు జనాభాను తగ్గించడం కష్టమని చాలామంది మేధావులు తనకు చెప్పారని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదరికం తగ్గించడానికి ఆనాడు కొన్ని నిర్ణయాలు చేశామని వెల్లడించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే.. స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా చట్టం తీసుకువచ్చామని ప్రస్తావించారు. ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు అని ఆనాడు స్లోగన్ ఇచ్చామని చెప్పా రు. ఇప్పుడు తానే చెబుతున్నానని.. సంతానం ఎక్కువుగా ఉండాలని అన్నారు. నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యధిక ఆదాయం సంపాదించేవారు తెలుగువారేనని తెలిపారు. ఆరోజు ఐటీ గురించి మాట్లాడానని.. ఈరోజు ఏఐ గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. ఆనాడు తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలంటే చాలా ఆలోచన చేసే వారని పేర్కొన్నారు.


అప్పుడు వరకట్నం.. ఇప్పుడు ఎదురు కట్నం..

ఆనాడు త్వరగా పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపిస్తే బాధ్యత అయిపోతుందని అనుకునేవారని సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పుడు మగపిల్లలకు పోటీగా ఆడపిల్లలు ఎదగాలని బాగా చదివించాలని చెప్పానని గుర్తుచేశారు. ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. అప్పుడు వరకట్నం ఉండేదని.. ఇప్పుడు ఎదురు కట్నం వచ్చిందని ప్రస్తావించారు. ఆడపిల్లలే ఎదురు కట్నం తీసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. నేడు భర్తల కన్నా భార్యల ఆదాయం ఎక్కువగా ఉందని వివరించారు. తనకన్న తన సతీమణి ఆదాయం, తన కొడుకు కంటే.. తన కోడలు ఆదాయమే ఇప్పుడు ఎక్కువుగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 07:17 PM