తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:15 PM
గాదె సాయికృష్ణ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్‌కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా.. ఏ కులం వారు చేసినా.. తప్పే కదా అని నిలదీశారు.
అమరావతి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్‌కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా.. ఏ కులం వారు చేసినా.. తప్పే కదా అని నిలదీశారు. కాపు అయితే ఒప్పు.. ఇంకొకరు అయితే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. తనకు పేపర్లు, ఛానళ్లు లేవని.. జనసైనికులే తన మీడియా అని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్నివర్గాలను సమానంగా చూడటమే సామాజిక న్యాయమని తెలిపారు.
అధికారం ఎప్పుడూ వాళ్ల చేతిలోనే ఉండాలా..?
కుల రాజకీయం పొలిటికల్ విక్టరీ అవుతుందేమో గానీ.. సామాజిక విక్టరీ కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అధికారం ఎప్పుడూ జగన్ అండ్ కో చేతిలోనేే ఉండాలా అని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లను చూడాలి.. ప్రతి అంశంలోనూ కులాన్ని, మతాన్ని కూడా వాడతారని ఎద్దేవా చేశారు. వైసీపీలో పనిచేసిన నాయకులు మన వేదిక మీద ఉన్నారని ప్రస్తావించారు. వీరు దిగజారి మాట్లాడిన దాఖలాలు ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. వైసీపీలో ఇతర నేతలు నోరు తెరిస్తే అసభ్య వ్యాఖ్యలే చేస్తారని.. వ్యక్తిత్వ హననాలు చేస్తారని చెప్పుకొచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మనిషి.. ఆయన విలువలతో మాట్లాడారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
దేశానికి సేవ చేసే వారిని ప్రోత్సహిస్తా..
18వేల మంది సాధక్‌లను కలవాలనేది తన భావన అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రతి ఊరిలో బాధ్యతలు అప్పగించిన నాయకుడు.. అక్కడ 2వేల మంది ప్రజలకు తెలిసి ఉండాలని తెలిపారు. ఎమ్మెల్సీ నాగబాబును అరకుకు పంపించామని.. ఆయన జనాలతో మాట్లాడతారని.. ప్రకృతిని సంరక్షిస్తారని అన్నారు. పల్నాడుకు బాలినేని శ్రీనివాసరెడ్డి కరెక్టు అని భావించి.. ఆ బాధ్యత అప్పగించామని చెప్పారు. కాకినాడను తట్టుకోవాలంటే.. సామినేని ఉదయభాను కరెక్టు అని భావించామని తెలిపారు. మంత్రి కందుల దుర్గేశ్‌ని అమలాపురం పంపితే బంధువులు ఎక్కువ అని అన్నారని చెప్పారు. మొహమాటానికెళ్లి.. ఎవరినైనా పెట్టాల్సి వస్తుందేమేనని ఆయన అన్నారని చెప్పారు. కానీ ఈ విషయంలో పని చేసే వారికే ప్రాధాన్యం అనేది ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ‘పుష్కర కాలం పాటు మీరంతా నలిగారని.. మీరు ఏపని చేస్తున్నారో కాదు.. దేశానికి సేవ చేసే వారిని ప్రోత్సహిస్తా’ అని స్పష్టం చేశారు. తనకు దేశం తర్వాతే ఏదైనా.. కులం అనేది సోషల్ రియాలిటీ అని చెప్పుకొచ్చారు. తాను ఈ విషయాన్ని మార్చాలనో, సరిదిద్దాలనో ప్రయత్నం చేయనని పేర్కొన్నారు.
నేను కులం కార్డుతో ఎప్పుడూ పాలిటిక్స్ చేయను..
తాను కులాల గురించి మాట్లాడతానని కొంతమంది అంటారని.. తాను కులం కార్డు తీసుకుని ఎప్పుడూ పాలిటిక్స్ చేయనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం బాగుండాలని, దేశం బాగుండాలని.. మానవత్వం ఉండాలనేదే తన ఆలోచన అని వ్యాఖ్యానించారు. కులం ఎప్పుడూ ఇంటి గడప లోపలే ఆగిపోవాలని.. గడప దాటాకా మన సంస్కృతి, ధర్మాలు ఉండాలని సూచించారు. ఇంకో పది అడుగులు వేస్తే.. దేశం, మానవత్వం గుర్తుకు రావాలని తెలిపారు. స్థాయికి దిగజారి మాట్లాడే వారికి కూడా కౌంటర్‌గా తాను మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. క్షేత్రస్థాయిలోకి మీరంతా ఓ మెసేజ్ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ కాకుండా పిల్లలు అందరికీ ఒకే హాస్టల్ ఉండాలనేది తన కోరిక అని ఉద్ఘాటించారు. ఆయా ప్రభుత్వాలే దశాబ్దాలుగా ఈ కులాల పేరుతో పిల్లలను విడదీస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్తే.. ఇటు దళితులు, అటు కాపులు, ఈ రోడ్డులో బీసీలు అంటూ విడగొట్టి మాట్లాడతారని అన్నారు. రాజకీయం ఇలానే నడుస్తుందనేది తనకు తెలియదని.. తనకు కులాల ఐక్యత ముఖ్యమని స్పష్టం చేశారు.
లింగమనేని రమేశ్‌కు రాజ్యసభ ఇస్తే రచ్చ చేశారు..
కులం ఐడెంటిటీని తాను మార్చలేనని... లింగమనేని రమేశ్‌కు రాజ్యసభ ఇస్తే.. ఆ కులం మీద కొంతమంది చర్చ, రచ్చ చేశారని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. శివ లాగానే రమేశ్‌ని గుర్తించి.. ఆయన పడిన కష్టానికి తాను బాధ్యతలు అప్పగించానని అన్నారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే.. అప్పుడు బాధపడే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. కొన్నిసార్లు ఇలాంటి విషయాల్లో బలంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. వైసీపీ పొలిటకల్ గేమ్ కోసం తన మీద విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఇన్ని బలమైన కులాలు ఉండి అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నాయని ప్రశ్నించారు. బీసీ సామాజిక వర్గాలు 105 కులాలు ఉంటే.. కాపుల్లో బలిజ, ఒంటరి, తెగలు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు అధికారం కోసం తాను పని చేయలేదని.. అవకాశాలు అడిగే స్థాయిలోనే ఉన్నానని తెలిపారు. యాభై శాతం బీసీ కులాలు ఉన్నవారంతా కలెక్టివ్‌గా ఉండి అధికారం సాధించుకోవచ్చు కదా అని చెప్పారు. గొడవలు అప్పుడు మాత్రం అందరూ ఏకం అవుతున్నారని అన్నారు. ఓట్ల సమయంలో మాత్రం ముక్కలుగా విడిపోయి వేరే వారికి అవకాశం ఇస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజాసేవే లక్ష్యం.. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆస్పత్రి నిర్మిస్తున్నాం: బాలకృష్ణ
వైసీపీ నేతలపై కేసులు.. మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై చర్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News