నిడదవోలు - దువ్వాడ మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:24 PM
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
ఢిల్లీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి ఊపిరిపోస్తుందని భావిస్తున్నారు.
ప్రాజెక్టు అంచనాలు..
ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 198 కిలోమీటర్ల నిర్మాణానికి రూ. 9889 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
లక్ష్యం: క్వాడ్రూప్లింగ్ (నాలుగు లైన్ల నిర్మాణం) ద్వారా రైళ్ల రద్దీని తగ్గించడం.
కవర్ చేసే జిల్లాలు: తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం.
పోర్టుల అనుసంధానం, పారిశ్రామికాభివృద్ధి..
తూర్పు తీరంలో ఉన్న ప్రధాన ఓడరేవులను ఈ రైల్వే లైన్ అనుసంధానిస్తుంది. దీనివల్ల ఎగుమతులు, దిగుమతులు సులభతరం అవుతాయి.
ప్రధాన పోర్టులు..
విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న సరుకు రవాణా సామర్థ్యం సుమారు 29.04 మెట్రిక్ టన్నుల మేర పెరుగుతుందని కేంద్ర రైల్వేశాఖ అంచనా వేసింది. బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, రసాయనిక ఎరువులు, ఆహార ధాన్యాలు, బాక్సైట్ వంటి సరుకుల రవాణా రెట్టింపు కానుంది.
మౌలిక సదుపాయాలు అద్భుతం..
ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఇంజనీరింగ్ పనులు జరగనున్నాయి. గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన భారీ రైల్వే వంతెనను నిర్మించనున్నారు. 2.67 కిలోమీటర్ల వయాడక్ట్, 3 ప్రధాన బైపాస్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త అలైన్‌మెంట్ వల్ల ప్రస్తుత మార్గం కంటే దూరం సుమారు 8 కిలోమీటర్లు తగ్గుతుంది, ఇది ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది.
పర్యాటక, ఆధ్యాత్మిక రంగానికి ప్రయోజనం..
ఈ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రయాణికుల రాకపోకలు సులభతరం అవుతాయి. అన్నవరం (సత్యనారాయణ స్వామి ఆలయం), అంతర్వేది (లక్ష్మీనరసింహ స్వామి ఆలయం), ద్రాక్షారామం (పంచారామ క్షేత్రం) వెళ్లడానికి సులువుగా ఉంటుంది.
ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు
ఈ ప్రాజెక్టు కేవలం రైల్వేలైన్ మాత్రమే కాదని, ఇది ఒక ఉపాధి కల్పన పొదుపు మార్గం కూడా కేంద్ర రైల్వేశాఖ అభిప్రాయపడింది. ఈ నిర్మాణ పనుల ద్వారా సుమారు 135 లక్షల మానవ-రోజుల పని (Man-days) లభిస్తుందని అంచనా. రోడ్డు రవాణాతో పోలిస్తే ఏటా సుమారు రూ. 1,150.56 కోట్ల వరకు ఆదా అవుతుంది. డీజిల్ వినియోగం తగ్గడం వల్ల కాలుష్య ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో సామర్థ్యం 130 శాతానికి చేరుకోవడంతో రైళ్ల ఆలస్యం సాధారణమైపోయాయి. ఈ మూడు, నాలుగో లైన్ల నిర్మాణం పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైళ్ల వేగం పెరగడమే కాకుండా, పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి చెందనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్
నారీ శక్తి వందన్ బిల్లుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. మంత్రి సత్యకుమార్ ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News