Share News

పేపర్ లీకేజీలకు చెక్‌పెట్టేలా నూతన విధానం.. సీఎం చంద్రబాబుతో నందన్ నీలేకని చర్చలు

ABN , Publish Date - Nov 04 , 2026 | 08:59 PM

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా మొత్తం విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సీఎం చంద్రబాబుతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ నందన్ నీలేకని సమావేశం అయ్యారు.

పేపర్ లీకేజీలకు చెక్‌పెట్టేలా నూతన విధానం..  సీఎం చంద్రబాబుతో నందన్ నీలేకని చర్చలు
Nandan Nilekani Meets CM Chandrababu

అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా మొత్తం విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సూచించారు. సీఎం చంద్రబాబుతో ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ నందన్ నీలేకని సమావేశం అయ్యారు. రాష్ట్ర సచివాలయానికి వచ్చిన నీలేకనికి.. ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ సాదర స్వాగతం పలికారు. దేశ పరీక్షల విధానాన్ని సమూలంగా మార్చటంలో భాగంగా నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్రప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై వివిధ రాష్ట్రాల్లో టాస్క్‌ఫోర్స్ బృందం పర్యటిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలను ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఏపీలో అనుసరిస్తున్న అకడమిక్, కాంపిటేటివ్ పరీక్షల నిర్వహణ విధానాలను ముఖ్యమంత్రిని అడిగి నీలేకని తెలుసుకున్నారు. పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట, పరీక్షల నిర్వహణకు టెక్నాలజీ వినియోగం, సైబర్ సెక్యూరిటీని, డిజిటల్ ఫోరెన్సిక్స్ విభాగాలను బలోపేతం చేయడంపై టాస్క్‌ఫోర్స్ దృష్టిసారించిదని నీలేకని తెలిపారు.


దేశవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్ష విధానాన్ని రూపొందించేలా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమన్యాయం జరిగేలా ఓ సమగ్రమైన జాతీయ పరీక్షా విధానాన్ని ఖరారు చేయడం కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు నందన్ నీలేకని తెలిపారు. డీఎస్సీ నిర్వహణలో అనుసరించిన నూతన విధానాలను, టెక్నాలజీ వినియోగాన్ని టాస్క్‌ఫోర్స్‌కు మంత్రి లోకేశ్ వివరించారు.


సీఎం సహాయనిధికి VIT విద్యాసంస్థ రూ.కోటి విరాళం

సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని VIT విద్యాసంస్థ అందజేసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును ఆ సంస్థ ఛైర్మన్ జి. విశ్వనాథన్ అందజేశారు. ఆర్నబ్, మురసు తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. విరాళం అందించే కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు

స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 09:33 PM