Share News

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

ABN , Publish Date - Aug 17 , 2026 | 10:01 AM

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు.

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ
AP Assembly Sessions

అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు ఈరోజు (సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు. ఈ క్రమంలో భీమిలిలోని ఎంజేపీ గురుకుల పాఠశాలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత సమాధానం ఇచ్చారు.


రూ.9.75 కోట్లతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం: మంత్రి సవిత

రూ.9.75 కోట్లతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ భవనానికి సంబంధించి అంచనాలు కూడా ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే ఈ అదనపు భవన నిర్మాణానికి అనుమతులను మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 70, 80 శాతం మేర అసంపూర్తిగా ఎంజేపీ భవనాలు నిలిచిపోయాయని తెలిపారు. రూ.80 కోట్లు వెచ్చించి ఆ భవన నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. ఆరు నెలల్లో ఎంజేపీ భవనాలను పూర్తి చేసి బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు.


బీసీ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు చేశాం: మంత్రి సవిత

ఏపీవ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో 90వేల 670 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి రాగానే రినోవేషన్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించారని వెల్లడించారు. బీసీ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. 1291 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. పది గురుకుల పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేశామని మంత్రి సవిత పేర్కొన్నారు.


బీసీ సంక్షేమ హాస్టళ్లలో 50శాతం వార్డెన్‌ల పోస్టులు ఖాళీ: ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి

బీసీ సంక్షేమ హాస్టళ్లలో 50శాతం వార్డెన్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తెలిపారు. సత్యసాయి జిల్లాల్లో 60 హాస్టళ్లలో కేవలం 26 మందే వార్డెన్‌‌లు ఉన్నారని ప్రస్తావించారు. 8వ తరగతి నుంచి నీట్, ఐఐటీ కోచింగ్ ఇప్పటినుంచే ఇస్తే బాగుంటుందని చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం మండలంలోని బీసీ హాస్టల్‌కు సొంత భవనం లేదని అన్నారు. బీసీ హాస్టళ్లలో ఇన్సులేటర్లు ఏమైనా పెడుతున్నారా..? అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రశ్నించారు.


మెట్రిక్ హాస్టల్ మంజూరైనా ఎందుకు సాకారం కాలేదు: కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి

అద్దెభవనాల్లో కడప నగరంలో ప్రభుత్వ బాలికల వసతి గృహం ఏర్పాటు చేశారని కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వెనుకబడిన బీసీ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. రెండేళ్ల నుంచి సంబంధిత మంత్రికి బీసీ హాస్టల్ పరిస్థితిని వివరించామని అన్నారు. 22 సంవత్సరాలకు ముందు మెట్రిక్ హాస్టల్ మంజూరైనా ఎందుకు సాకారం కాలేదని ప్రశ్నించారు. కడపలో సొంత భవనంతో బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి డిమాండ్ చేశారు.


వార్తలు కూడా చదవండి...

ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 12:24 PM