Share News

జగన్ అండ్ కో వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి: జనసేన

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:58 AM

వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై జనసేన అగ్రనేతలు అధికారిక లేఖ విడుదల చేశారు. విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని పేర్కొన్నారు.

 జగన్ అండ్ కో వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి: జనసేన
Jana Sena Party

అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై జనసేన (Jana Sena) అగ్రనేతలు అధికారిక లేఖ విడుదల చేశారు. విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని అందులో పేర్కొన్నారు. న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చు.. దాడులే సమాధానం కాదని చెప్పుకొచ్చారు. వైసీపీ చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలకు కూటమి పార్టీలు ఏం చేయాలి? అని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి నడవడికను జెన్-జీ గమనిస్తోందని, ఈ విషయాన్ని మరచిపోవద్దని హితవు పలికారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయని అన్నారు. వాటిపై స్పందించడంలోనూ ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని సూచించారు. విమర్శలను స్వీకరించలేక దాడులకు తెగబడటాన్ని ఎవరూ హర్షించరని అన్నారు. విమర్శలకు దాడులు సమాధానం కావని పేర్కొన్నారు.


జగన్ హద్దులు దాటి మాట్లాడారు..

విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలపై చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించిందని జనసేన అగ్రనేతలు లేఖలో రాసుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలోనూ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పాఠశాల విద్యార్థుల సమక్షంలోనే హద్దులు దాటి, దిగజారుడు మాటలు మాట్లాడారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను కారుతో పోల్చి మాట్లాడిన జగన్ వాచాలత్వాన్ని ప్రజలు, కూటమి నాయకులు, శ్రేణులు మరచిపోలేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడి, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. 'జగన్ రెడ్డి కార్యాలయాలపై గానీ, ఆయనకు చెందిన సంస్థలపై గానీ జనసేన, పవన్ కల్యాణ్ అభిమానులు ఏనాడైనా దాడికి తెగబడ్డారా.?' అని ప్రశ్నించారు.


దిగజారి మాట్లాడవద్దని పవన్ కల్యాణ్ చెప్పారు..

పవన్ కల్యాణ్ ప్రతి సందర్భంలో పార్టీ నాయకులకు, శ్రేణులకు స్పష్టంగా చెప్పేవారని.. ‘ఎదుటివారు దిగజారి మాట్లాడినా, మనం వారి స్థాయికి దిగజారవద్దు’ అని అన్నారని జనసేన అగ్రనేతలు ప్రస్తావించారు. ప్రజాస్వామ్య రీతిలోనే స్పందించాలన్నారని చెప్పారు. కుటుంబంలోని మహిళలు, ఆడబిడ్డలపై ఎట్టిపరిస్థితుల్లోనూ కామెంట్స్ చేయొద్దని, ఎవరైనా హద్దు మీరితే అంతర్గతంగా వారికి పవన్ కల్యాణ్ నిర్దేశించిన నియమాలను పార్టీ ముఖ్యులు తెలిపేవారని.. అదీ జనసేన విధానమని.. ఈ తరహా నిర్దేశాలను వైసీపీ నుంచి ఎప్పుడూ ఆశించలేమని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై వ్యాఖ్యలు చేస్తే నవ్వుతూ ప్రోత్సహించిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఆగ్రహించారు. టీడీపీకి చెందిన అధికార ప్రతినిధి చేసిన కామెంట్స్‌కు వైసీపీ శ్రేణులు టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాయని ప్రస్తావించారు. వాళ్లు ఇష్టానుసారం మాట్లాడచ్చు.. కానీ వాళ్లను ఎవరైనా విమర్శించినా, ఒక మాట తూలినా కండ బలాన్ని ప్రదర్శించి హింసకు దిగుతారని అన్నారు. వైసీపీ నేతలు ఈ రోజుకీ దిగజారి, అభ్యంతరకరంగానే మాట్లాడుతున్నారని చెప్పారు. వీటిపై కూటమి శ్రేణులు ఎన్నిసార్లు వైసీపీపై కండబలాన్ని ప్రదర్శించాలి? అని ప్రశ్నించారు. ఎదుటివారు హద్దులు మీరి మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులుపెట్టినా చట్టబద్ధంగా ముందుకెళ్లాలని జనసేన అగ్రనేతలు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం

నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్ ధ్వజం

ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 12:35 PM