Share News

ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 08:27 PM

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
AP CM Chandra babu Naidu

అమరావతి , ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. ఈరోజు (మంగళవారం) ఆర్టీజీస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయలని మార్గనిర్దేశం చేశారు. టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు.


ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం వద్దు...

ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడా ఆలస్యం కాకూడదని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా తాము ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోందని.. ఇది కొనసాగాలని అన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలిందన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాన్ని ఎంత వేగంగా చేపడుతున్నారో.. ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అదే స్థాయిలో చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఇక వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుంటున్నామన్నారు. రీచుల వద్ద, స్టాక్ యార్డుల వద్ద రవాణా పేరుతో కానీ... ఇతర పేర్లతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఈ విషయంపై పటిష్ఠ నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


కాలేజ్ కరిక్యులాన్ని రీ స్ట్రక్చర్ చేయాలి..

కాలేజీ విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ విద్యను రీ-ఓరియేంటేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు అధ్యయనం చేయాలని, యూనివర్సిటీలతో నిత్యం అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ట్రెడిషన్ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న కోర్సులను, కొత్త కరిక్యులాన్ని ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు కరికుల్యాన్ని రీ-స్ట్రక్చర్ చేసేలా చూడాలన్నారు. అలాగే యూనివర్సిటీల ర్యాంకింగులు కూడా మరింతగా పెరగాల్సి ఉందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీతోపాటు... మిగిలిన యూనివర్సిటీలు కూడా ర్యాకింగులను మరింతగా పెంచుకోవాల్సి ఉందని సూచించారు. ఇదే సందర్భంగా హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ కూడా మరింత యాక్టివ్‌గా ఉండాలని.. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని నిర్దేశించారు. మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు కానీ... విమర్శలు కానీ రాకూడదన్నారు. శాప్ విభాగం తన యాక్టివిటీని మరింత పెంచుకోవాలని సూచించారు. 5కే రన్ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల్లో, యువతలో ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన కల్పించేలా శాప్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు, మరణాలు జరుగుతున్నాయని.. ఇలాంటి వాటిని నివారించాలని ఆదేశించారు. కఠినంగా నిబంధనలు అమలు చేయడానికంటే ముందు... ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని సూచించారు. హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తమ కోసమేననేది ప్రజలు అర్థం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్, కేబుల్ తీగలు కిందకు వేలాడుతున్న కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. ఇలాంటివి ఇకపై జరగడానికి వీళ్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం..

పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నామని...అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీని వినియోగిస్తున్నామని... కానీ ప్రజల్లో దానిపై అవగాహన కలిగించేలా చేయకుంటే ఏం ఉపయోగం...? ఉంటుందని అన్నారు. ఫోన్లల్లో మెసేజీలు పెట్టడమే కాదని... క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని అలర్ట్ చేయాలని సూచించారు. అలాగే ఫలానా టవర్ లోకేషన్ పరిధిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని నెట్‌వర్క్ ద్వారా ప్రజలకు తెలియచేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్2.0 మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకోవచ్చు..

అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి జెండా ఊపి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకీకరణ చేశారని.. ఇందులో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రూ.10 కోట్ల వ్యయంతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. పరికరాలు, వాహనాల గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకున్న అధికారులను సీఎం అభినందించారు.


ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి..

ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధానితో పాటు ఇప్పుడు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్‌లు నిర్మాణం అవుతున్నాయని.. వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాలా ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. గతంలో అగ్నిమాపక విభాగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేవాళ్లమని...ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి రావాలని ఆకాంక్షించారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఉందని ప్రస్తావించారు. అన్ని సవాళ్లను అధిగమించి కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని బలోపేతం అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ పీవీ రమణ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


పెట్టుబడులపై ఎస్ఐపీబీ సమావేశంలో చర్చ..

అంతకుముందు.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16 వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, కె.అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, నారాయణ, వాసంశెట్టి సుభాశ్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ సాయిప్రసాద్ సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో వేర్వేరు పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 09:00 PM