నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:11 PM
‘నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు మంచి క్రమశిక్షణను మా ఉపాధ్యాయులు నేర్పారు’ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
విజయవాడ, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ‘నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు మంచి క్రమశిక్షణను మా ఉపాధ్యాయులు నేర్పారు’ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు (శనివారం) విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చామని ఉద్ఘాటించారు. డీఎస్సీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డీఎస్సీ అని అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం అమలు చేశారని తెలిపారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తులు తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి వ్యవస్థలను నాశనం చేయడం తెలిస్తే, సీఎం చంద్రబాబుకు వ్యవస్థలను గాడిలో పెట్టడం తెలుసునని పేర్కొన్నారు.
మట్టిలో మాణిక్యాలను సరస్వతీ పుత్రులుగా ఉపాధ్యాయులు మార్చగలరు..
‘ఉపాధ్యాయులు తలుచుకుంటే.. మట్టిలో మాణిక్యాలను సరస్వతీ పుత్రులుగా మార్చగలరు. ఈరోజు 175 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా మేము ఎంపిక చేశాం. కేవలం సర్టిఫికెట్ ఇచ్చి సరిపెట్టకుండా.. సింగపూర్, ఇతర ప్రాంతాలకు పంపించాం. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి.. ఇంకా మెరుగుపరిచేలా ఉపాధ్యాయులతోనే అధ్యాయనం చేయిస్తున్నాం. శివసుబ్రహ్మణ్యం అనే గురువు ప్రాక్టికల్‌గా వివరిస్తే.. నాడు స్టూడెంట్‌గా ఉన్న అబ్దుల్ కలాం సైంటిస్టుగా, భారతరత్నగా, రాష్ట్రపతిగా ఎదిగారు. మనందరిపైన కూడా అలాంటి పవిత్రమైన బాధ్యత ఉంది. సావిత్రిభాయి ఫూలే కాలంలో చదువుతానని ధైర్యంగా ముందుకు వచ్చి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మారారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యాశాఖను నేను ఎంచుకున్నాను. పాలనలో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి.. వాటిని స్వీకరిస్తాను. అంగన్‌వాడీ నుంచి ఇంటర్ చదవు వరకు ప్రపంచంలో మేటిగా ఏపీ నిలబడాలి’ అని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు.
వైసీపీ హయాంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టారు..
‘వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 12లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్లారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు వైసీపీ హయాంలో నిలబెట్టారు. మేము అందరితో మాట్లాడి జీవో నంబర్- 117ను రద్దు చేశాం. నేడు వన్ ప్లస్ వన్ టీచర్ విధానాన్ని తీసుకువచ్చాం. సీనియారిటీ లిస్ట్ ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా 16వేల పోస్టులు ఇచ్చాం. ఏ అధికారుల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా పోస్టులు, ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు ఇచ్చాం. మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో అమలు చేశాం. రైతులతో కూడా చర్చించి ఫైన్‌రైస్‌ను పిల్లలకు అందిస్తున్నాం. సీఎం చంద్రబాబు ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నారో ఇలాంటి ఘనతలే నిదర్శనం. నిడమర్రులో మోడల్ స్కూల్‌గా లీప్ పాఠశాలను అభివృద్ధి చేశాం. అన్ని నియోజకవర్గాల్లో ఇదే మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయడం మా ప్రభుత్వం లక్ష్యం’ అని మంత్రి నారా లోకేశ్ ఉద్ఘాటించారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఆరు శాతం వృద్ధి రేటు..
‘చాగంటి కోటేశ్వరరావుకు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చి... పిల్లల్లో మంచి ఆలోచనలు అందించేలా పుస్తకాలు అందించాం. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు లక్షా 10వేల మంది పిల్లలు వచ్చారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఆరు శాతం వృద్ధి రేటు చూపించాం. ఎప్పటికప్పుడు మారుతూ.. సవాళ్లను అధిగమించడం సీఎం చంద్రబాబు నాకు నేర్పుతారు. పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు రాణించేలా శిక్షణ ఇస్తున్నాం. 23 క్లస్టర్స్‌ను తయారు చేస్తున్నాం.. అందరూ భాగస్వామ్యం కావాలి. రాజకీయ ప్రభావం లేకుండా ప్రతిభ ఆధారంగా కీలక పోస్టింగ్‌లు ఇచ్చాం’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News