Share News

నా గురువు చేతిలో నేనూ దెబ్బలు తిన్నాను: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:12 PM

తాను చదువుకునే రోజుల్లో భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

నా గురువు చేతిలో నేనూ దెబ్బలు తిన్నాను: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

విజయవాడ, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): తాను చదువుకునే రోజుల్లో భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్న వారు కూడా దెబ్బలు తిన్నవాళ్లేనని పేర్కొన్నారు. నేడు విద్యార్థులు మరింత సుకుమారంగా మారిపోయారని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు (శనివారం) విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.


ఆ ప్రిన్సిపాల్‌ను దారుణంగా చంపేశారు..

మొన్న రంపచోడవరంలో ఓ అమ్మాయి బాగా మాట్లాడిందని.. ఆ తర్వాత చూస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే విద్యార్థుల్లో క్లాస్ రూమ్‌తో పాటు, బయట జరిగే పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. మొన్న పదోతరగతి చదివే పిల్లలు ప్రిన్సిపాల్‌ను దారుణంగా చంపేశారని చెప్పారు. విజయనగరంలో ఫోన్ చూడవద్దంటే.. తల్లిని కూడా చంపేశారని ప్రస్తావించారు. విశాఖపట్నంలో టీచర్ హోంవర్క్ చేయలేదని కొడితే.. పిల్లాడు చనిపోయాడని అన్నారు. కొంతమంది పిల్లలు పరీక్షలు పాస్ కాలేమనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం మారిన పరిస్థితులకు అనుగుణంగా సున్నితంగా ఉపాధ్యాయులు ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక్కడ 175 మంది బెస్ట్ గురువులు ఉన్నారని ప్రస్తావించారు. ఏఐలో కూడా చాలా మార్పులు వస్తున్నాయని.. వాటిని కూడా గమనించాలని అన్నారు. టెక్నాలజీని అవైడ్ చేయలేరని... ఎవరైనా స్వీకరించాలి.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


టీచింగ్ ప్రొఫెషన్ ఇప్పుడు బాగా మారిపోయింది..

టెక్నాలజీతో కొత్త సవాళ్లు , కొత్త అవకాశాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏఐ వల్ల గురువు, విద్యార్థికి ఒకే సమాచారం వస్తోందని పేర్కొన్నారు. కానీ టీచర్‌కు ప్రత్యామ్నాయం మళ్లీ మరొక టీచరే మాత్రమేనని తెలిపారు. టెక్నాలజీతో అనేక కొత్త సవాళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ‘టీచింగ్ ప్రొఫెషన్ ఇప్పుడు బాగా మారిపోయింది. నేను సీఎంగా బాధ్యత చేపట్టిన తర్వాత మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాను. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీచర్ నియామకం ముఖ్యమని చెప్పాను. కోర్టులో ఉన్న లిటికేషన్లను అధిగమించి మెగా డీఎస్సీ నిర్వహించాం. ఏడేళ్లుగా ఎంతో కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు వచ్చాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ.. ఆ తర్వాత ఆచార్య దేవో భవ అనేది మన సంస్కృతి. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మన జీవితాన్ని నిర్దేశించేది గురువులే. మనకు చదువు చెప్పిన టీచర్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. మీ ముందు కూర్చున్న విద్యార్థుల్లో శాస్త్రవేత్త, క్రీడాకారుడు, ఉండొచ్చు.. వారిని గుర్తించి ప్రోత్సహించాలి. విద్యార్థులు ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు.. మీ ప్రభావం చాలా ఉంటుంది. మన పిల్లలు పుస్తకాలు చదవాలి, అదే సమయంలో ప్రపంచాన్ని కూడా చదవాలి. ఇవి నేర్పే ఏకైక వ్యక్తి ఆ స్కూల్లో ఉండే టీచరే మాత్రమేనని గుర్తుంచుకోవాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఆ సమయంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది

‘నేను ఈరోజు గురించి ఆలోచించను.. వచ్చే ముప్పై, నలభై ఏళ్ల గురించి ఆలోచన చేసి.. ఇప్పటి నుంచి పని మొదలు పెడతాను. నేను తొలిసారిగా సీఎం అయిన సమయంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. నేను అది గుర్తించి ఐటీని ప్రమోట్ చేశాను. మంత్రి నారా లోకేశ్ విదేశాల్లో ఉన్న సమయంలో ఫోన్ బిల్లు లక్షల్లో వచ్చేది. చైనాను స్టడీ చేసి.. నాకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేంద్ర పెద్దలతో మాట్లాడాను. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ హయాంలో టెలి కమ్యూనికేషన్ సెంటర్‌లో డీ రెగ్యులేషన్ తీసుకువచ్చారు. ఆ ఒక్క నిర్ణయంతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. నేడు ఏ మూలకు వెళ్లి తెలుగులో గట్టిగా మాట్లాడినా.. పది మంది మనవాళ్లు వస్తారు. నేడు హయ్యెస్ట్ ఇన్ క్యాపిటల్ చిరునామా తెలుగువారు’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు..


మా చదువులు వేరు.. ఇప్పుడున్న చదువులు వేరు..

‘ఐటీ కూడు పెడుతుందా, సెల్‌ఫోన్ ఎవరికి కావాలి, పంపు సెట్ కావాలన్నారు. నేను సెల్‌ఫోన్ కావాలి, పంపుసెట్ కావాలని సమర్థించుకుని ముందుకెళ్లా. నేడు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. మా చదువులు వేరు.. ఇప్పుడున్న చదువులు వేరు. అమెరికా అభివృద్ధి చెందిందంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తులను అక్కడకు ఆహ్వానించడం వల్లే సాధ్యమైంది. ఏషియన్ టైగర్స్ సింగపూర్, మలేషియాలు అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత చైనా నలభై ఏళ్ల కృషితో అభివృద్ధి చెందింది. నేడు సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో విధాలుగా అందుబాటులోకి వచ్చింది. పది, పదిహేనేళ్ల తర్వాత డిఫరెంట్ ఇండియాను మీరంతా చూడబోతున్నారు. అభివృద్ధి కోసం అనేక దేశాలు వంద, నలభై ఏళ్లు .. ఇరవై ఏళ్లల్లో మన దేశం అభివృద్ధి చెందుతుంది. 1990 ముందు కమ్యూనిజం, సోషలిజం అని మాట్లాడే వాళ్లం. ఆ తర్వాత పోటీతత్త్వం వచ్చింది.. అభివృద్ధి సాధ్యమైందని... కానీ విలువలు పడిపోయాయి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఫోన్ లేకుండా ఉండలేక పోతున్నారు..

‘భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త ఉంటున్నారు.. కానీ ఫోన్ లేకుండా మాత్రం ఎవరూ ఉండలేక పోతున్నారు. టెక్నాలజీ, స్పిరిచువాలిటీ.. ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. కొత్తగా వస్తున్న మార్పులపై డిబేట్, డిస్కషన్ జరగాలి. ప్రపంచంలో భారతదేశ సంస్కృతి ది బెస్ట్. కుటుంబ వ్యవస్థ, మంచి చెడులను విశ్లేషించేది మన సంస్కృతే. ఎడ్యుకేషన్ పూర్తి అయినా.. కొత్తగా వారిని ట్రైన్ చేసుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఎరోస్పేస్, డ్రోన్ సిటీ, డేటా సెంటర్ వంటివి అనేకం వస్తున్నాయి. మరోవైపు ఫార్మా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటివి వృద్ధి చెందుతున్నాయి. లోకేశ్ విద్యాశాఖ తీసుకుంటానని చెప్పినప్పుడు నేను కూడా చాలా ఆలోచించా. నాలెడ్జ్ ఎకానమీగా తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పిన మాటలకు నేను ఆనందపడ్డాను. మరో 25 సంవత్సరాల్లో జనాభా పెరిగే దేశం ఒక్క భారతదేశమే. ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుతుంది.. దక్షిణ భారతదేశంలో కూడా ఇది జరగాలి. టీచర్లు కూడా ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఒకనాడు ఎయిడ్స్ గురించి నేనే మాట్లాడాను.. ఇప్పుడు జనాభా తగ్గిపోకుండా చూసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


తొలిసారిగా కౌన్సెలింగ్ పెట్టాం..

‘175 మందిని నేడు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వారందరు చేసిన స్ఫూర్తివంతమైన పనులను పుస్తకాలుగా వేసి అందరికీ పంపిణీ చేయాలని సూచించాను. ఒకనాడు జిల్లా పరిషత్ చైర్మన్లు టీచర్ల ట్రాన్స్‌ఫర్లు నిర్ణయించేవారు. మీ పని తనమే మీ శ్రీరామ రక్ష అని భావించి తొలిసారిగా కౌన్సెలింగ్ పెట్టాం. మరింత వృద్ధి చేసి మీ మంత్రి లోకేశ్ మరికొన్ని మార్పులు తీసుకువచ్చారు. టీచర్లుగా మహిళలు బాగా చెబుతారనే 33శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చాను. తల్లికి వందనం, మధ్యాహ్నం భోజన పథకం ద్వారా పిల్లలు స్కూళ్లకు వస్తున్నారు. పాఠశాల వయసులో పిల్లలంతా బడిలోనే ఉండాలి, బయట కాదనే నినాదాన్ని తీసుకోవాలి. ఎలిమెంట్రీ నుంచి ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీల వరకు ఎడ్యుకేషన్ రీ బ్యాంకు చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీల్లో చాలా కోర్సులు లేకుండా పోయాయి. రీసెర్చ్, పబ్లికేషన్ , ర్యాంకింగ్‌లో వెనుకబడిపోయాం. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ మన దగ్గర ఉండాలి’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


2027 నాటికి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఏపీ ఉండాలి..

2027 నాటికి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఏపీ ఉండాలి. 2047 నాటికి భారతదేశం మొదటి స్థానంలో ఉంటే, మన దేశంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలి. ఆ సంకల్పం చేయాల్సిన ప్రదేశం పాఠశాల. అది సాధించేది మన గురువులు మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. మైల్డ్ స్టోన్స్ పెట్టుకుని ఇప్పటి నుంచే అందరూ పని చేయాలి. దశ, దిశ నిర్దేశించే బాధ్యత గురువులపైనే ఉంది. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి.. అనవసరమైన విషయాలను మరిచిపోవాలి. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా మారాలి. తొమ్మిదోసారి ఎమ్మెల్యే, ఎక్కువ కాలం సీఎంగా ఉన్నా.. ఇంకా విద్యార్థిగా కొత్త విషయం నేనూ నేర్చుకుంటూనే ఉంటాను. మంత్రుల పని తీరుకు మార్కులు ఉన్నట్లే.. ఉపాధ్యాయులకు కూడా మార్కులు ఉంటాయి. నాయకుడు అంటే మంత్రులు కాదని... మీరే నాయకులు.. టీచర్లు బాగా ఆలోచన చేయాలి. లీడర్ షిప్ కాన్ క్లేవ్‌ను మా ఎమ్మెల్యేలు, ఎంపీలకు పెడుతున్నాం. ప్రతి పాఠశాల మోడల్ స్కూల్‌గా మారితే.. విద్యార్థులు రాణిస్తారు. విద్యార్థుల్లో క్రియేటివిటీని ఎప్పటికప్పుడు పెంచాలి. విద్యార్థులు మొన్న అసెంబ్లీలో మా ఎమ్మెల్యేల కన్నా అదరగొట్టారు. వారి డిబేట్స్ చూస్తే ముచ్చటేసింది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ

జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 06:32 PM