డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 02:28 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
అమరావతి, ఏప్రిల్13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) ఈరోజు(సోమవారం) సచివాలయంలో స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రతిపాదిత డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై సీఎం సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం, అనుమతుల్లో సులభతరం, అనవసరపు పర్మిషన్ల నియంత్రణపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను సీఎం ముందు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ఉంచారు. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఎం సమీక్షించారు. 800కు పైగా ఉన్న నిబంధనలను 100లోపునకు తీసుకురావాలని సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలి..
పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అటవీ చట్టాలను వీలైనంత మేరకు సరళీకరించాలని కేంద్ర బృందానికి సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని ఆదేశించారు. డబుల్ లైసెన్సింగ్ తరహా పద్ధతులను తప్పించాలని దిశానిర్దేశం చేశారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవిత కాలం చెల్లుబాటు కావాలని సూచించారు. మే నెలాఖరులోగా డీరెగ్యులేషన్ ఫేజ్-2 అమల్లోకి వచ్చేలా చూడాలని.. ఆ మేరకు ఆర్డినెన్సులు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.
దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్ చేయాలి..
దరఖాస్తు నుంచి అనుమతుల వరకూ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫేజ్-2 అమలు తర్వాత పరిశ్రమల అనుమతుల ఏర్పాటుకు ఇప్పుడున్న ప్రక్రియలో 40 శాతం మేర సమయం తగ్గాలని సూచించారు. పరిశ్రమలకు అనుమతులు, నిబంధనలను సడలించే విషయంలో తమ ప్రతిపాదనలకంటే ఏపీ చాలా ముందుందని కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ తెలిపారు. తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర బృందానికి సీఎం వివరించారు.
ఏఐ టూల్స్ వినియోగానికి పెద్దపీట వేయాలి..
ప్రజలకు సేవలు అందించడం కోసం స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. డీ-రెగ్యులేషన్ ఫేజ్-3ను చేపడుతున్నారా అని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్‌ను అడిగారు. జూన్ నుంచి ఫేజ్-3పై పని చేస్తామని సందీప్ పౌండ్రిక్ చెప్పారు. ఫేజ్-3లో టెక్నాలజీ అనుసంధానం, ఏఐ టూల్స్ వినియోగానికి పెద్దపీట వేయాలని స్టీల్ సెక్రటరీకి సీఎం సూచించారు. డేటా లేక్, రియల్ టైం డేటా, సీఎఫ్ఎంఎస్, అవేర్-2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను తాము వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బెట్టింగ్, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు
వైద్య రంగంలో సమూల మార్పులు: మంత్రి సత్య కుమార్
Read Latest AP News And Telangana News And International News And Telugu News