Share News

కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం భేటీ.. పోలవరంపై కీలక చర్చలు

ABN , Publish Date - May 11 , 2026 | 02:41 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(సోమవారం) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. పలువురు కేంద్రమంత్రులను ముఖ్యమంత్రి కలిసి ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారు.

కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం భేటీ.. పోలవరంపై కీలక చర్చలు
AP CM Chandrababu Naidu

ఢిల్లీ, మే11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (సోమవారం) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. అలాగే, పలువురు కేంద్రమంత్రులను కలిసి ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో (CR Patil) సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ సీఆర్ పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు.


గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేసేలా చర్యలు..

2027 గోదావరి పుష్కరాల్లోపు ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే తాను స్వయంగా ఐదుసార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 2026 ఏప్రిల్ 2వ తేదీ నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని, గ్యాప్ 1, గ్యాప్ 2లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి..

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందనే కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్ఫష్టం చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్లు వివరించారు. ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర.. ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయ్యాయని తెలిపారు. కాలువల సామర్థ్యం పెంచిన మేరకు నిధులను రీయింబర్స్ చేయాలని జలశక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.


నిధులు మంజూరు చేయాలి..

పోలవరం ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి సీంచాయి యోజన కింద ఏపీలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునికీకరణకు నిధులు మంజూరు కోరుతూ లేఖ ఇచ్చారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునికీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేయాల్సి ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయొద్దని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు.


ఆ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలి..

ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని.. ఎలాంటి సాంకేతిక, పాలనా పరమైన అనుమతులు మంజూరు చేయొద్దని సీఎం చంద్రబాబు సూచించారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-III కింద భూసేకరణ ఇతర సన్నాహక పనులు చేయకుండా కర్ణాటకను ఆదేశించాలని, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల వరద జలాలలను మళ్లించేలా పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. ఏపీ నీటి అవసరాలకు అనుగుణంగా 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణం చేపడతామని తెలిపారు. దీనికి అవసరమైన భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాల్సిందిగా జలశక్తి శాఖ మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 03:58 PM