Share News

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - May 10 , 2026 | 09:43 PM

విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం కైలాసగిరిలో ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలం ఏపీ వ్యాప్తంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా స్పందించారు.

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి  నారా లోకేశ్
AP Minister Nara Lokesh

విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం కైలాసగిరిలో ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలం ఏపీ వ్యాప్తంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(AP Minister Nara Lokesh) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. విశాఖ కైలాసగిరిని గుజరాత్‌లోని పవిత్ర సోమనాథ ఆలయంతో లోకేశ్ పోల్చారు.


సోమనాథ్ పునరుద్ధరణకు 75 ఏళ్లు..

తన పోస్టులో సోమనాథ ఆలయ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. గుజరాత్‌లోని పవిత్ర సోమనాథ ఆలయం చారిత్రక పునరుద్ధరణ జరిగి రేపటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయని వివరించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కైలాసగిరిలో 65 అడుగుల భారీ త్రిశూలాన్ని ఆవిష్కరించడం ఆధ్యాత్మిక, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీక అని పేర్కొన్నారు.


సోమనాథ్ నుంచి వైజాగ్ వరకు..

భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం దేశ సంస్కృతిలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ నిర్మాణాలు తెలియజేస్తున్నాయని నారా లోకేశ్ అన్నారు. సోమనాథ్ నుంచి వైజాగ్ వరకు భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వం సంస్కృతి, విశ్వాసం, మంచితనంలో పాతుకుపోయి మరింత బలంగా ఎదగడానికి మనకు స్ఫూర్తినిస్తోందని లోకేశ్ తెలిపారు.


కైలాసగిరి ప్రత్యేకత..

విశాఖపట్నం సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న కైలాసగిరి ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం మరింత ఆధ్యాత్మిక ఆకర్షణగా మారింది. సోమనాథ్ ముందు విస్తరించిన సముద్రం దృఢత్వానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచినట్లే, కైలాసగిరి కూడా సముద్రానికి అభిముఖంగా నిలుస్తూ అదే శాశ్వతమైన ఆధ్యాత్మిక స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.


ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం..

కైలాసగిరిలో భారీ త్రిశూలం ఏర్పాటు చేయడం ద్వారా విశాఖపట్నంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ఊతమిస్తుందని భక్తులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి సోయగాలు, రోప్‌వే, శివపార్వతి విగ్రహాలతో ప్రసిద్ధి చెందిన కైలాసగిరి ఇప్పుడు ఈ భారీ త్రిశూలంతో మరో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని భక్తులు చెబుతున్నారు. ఈ భారీ త్రిశూలాన్ని చూసేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 10 , 2026 | 09:43 PM