Share News

ఏపీలో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - May 21 , 2026 | 04:02 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, అలాగే ఎస్‌ఐపీబీ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించారు.

ఏపీలో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం స్పెషల్ ఫోకస్
AP CM Chandra babu Naidu

అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) అధ్యక్షతన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం ఈరోజు(గురువారం) సచివాలయంలో జరిగింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, అలాగే ఎస్‌ఐపీబీ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబుకి వివరాలు అందించింది. ఇప్పటివరకు ఎస్‌ఐపీబీ ద్వారా రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో మొత్తం 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు సీఎం వెల్లడించారు.


పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి..

రాష్ట్ర అభివృద్ధికి ఇవి కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల్లో ఇప్పటికే 114 ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరుకున్నాయని, వాటి ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని లోకేశ్ వివరించారు. పెట్టుబడిదారులతో కుదిరిన ఒప్పందాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఎంఓయూలకు సంబంధించిన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని, అవసరమైన భూ కేటాయింపులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టులు త్వరగా గ్రౌండింగ్ దశకు చేరి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


యువతకు ఉద్యోగాలు కల్పించాలి..

రాష్ట్రానికి పెట్టుబడులు రావడం మాత్రమే కాకుండా, అవి వేగంగా అమలై యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ప్రాజెక్టుల గ్రౌండింగ్ చేయాలి..

ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఆయా ప్రాజెక్టుల గ్రౌండింగ్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2028 చివరి నాటికి ఆయా ప్రాజెక్టులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ మేరకు మంత్రుల కమిటీ, అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. పెట్టుబడిదారులకు సింగిల్ పోర్టల్ ద్వారా సేవలు అందజేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. గోవా ప్లస్‌గా సూర్యలంక బీచ్ - త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. 23 నెలల్లో ఏపీకి 756 ప్రాజెక్టులు, రూ.21.64 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రస్తావించారు. రాష్ట్ర యువతకు 21.20 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎంఓయూలు, ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 08:12 PM