సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 20 , 2026 | 09:23 PM
సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధితో పాటు ప్రజలకు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని పేర్కొన్నారు.
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధితో పాటు ప్రజలకు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని పేర్కొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని తయారు చేయటమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. బెంగుళూరు-ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ ఈరోజు (బుధవారం) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. స్పేస్, డ్రోన్, డేటాసెంటర్లు ఏపీలో ఏర్పాటవుతున్నాయని తెలిపారు. మొదటి క్వాంటం కంప్యూటర్ ఏపీలో ఏర్పాటు అవుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. ఇంత అభివృద్ధి సాధిస్తున్నా ప్రజల్లో శాంతి సౌఖ్యాలు రావాలంటే ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు.
శ్రీ రవిశంకర్ గురూజీ బోధనలను అనుసరిస్తున్నా..
శ్రీ రవిశంకర్ గురూజీ జన్మదినోత్సవంతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవంలో పాల్గొనటం గౌరవంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేవలం ఓ ముఖ్యమంత్రిగానే ఇక్కడికి రాలేదని.. ఓ భారతీయుడిగా, గురూజీ బోధనలను అనుసరిస్తున్న వ్యక్తిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఆయన కేవలం ఓ ఆధ్యాత్మికతను బోధించే ఓ గురువు మాత్రమే కాదని.. శాంతిసామరస్యాలను చాటిచెప్పే ప్రపంచ మానవుడని చెప్పుకొచ్చారు. ప్రాచీన భారతీయ విజ్ఞానానికి, ఆధునిక ప్రపంచానికి వారధిగా శ్రీరవిశంకర్ గురూజీ వ్యవహరిస్తున్నారని ఉద్ఘాటించారు. హింసలేని సమాజం - ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని సాధించాలని దశాబ్దాలుగా బోధిస్తూ మానవాళికి గొప్పసేవ చేస్తున్నారని తెలిపారు. యుద్ధాలతో శాంతికి దూరమైన సమాజాన్ని, అనిశ్చితి నుంచి బయట పడేసేలా మానవత్వం అనే అత్యుత్తమ మార్గాన్ని ఆయన ఎంచుకున్నారని ప్రస్తావించారు. యుద్ధక్షేత్రాల నుంచి ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్, డైలాగ్, ఇన్నర్ స్ట్రెంత్ అనే విధానాలను అనుసరించారని వెల్లడించారు.
ఒత్తిడిని ఎదుర్కోని సమర్ధంగా జీవించాలి..
గ్యాస్, ఇంధనం లాంటి వనరుల మార్కెట్ లభ్యత ప్రజలను ఒత్తిడికి గురి చేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమయంలో ఒత్తిడిని ఎదుర్కోని సమర్ధంగా జీవించాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు. ఇలాంటి సమయంలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు మానవాళికి అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంటి సమర్ధవంతమైన నేత దేశానికి నేతృత్వం వహిస్తున్నారని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రగామిగా మారుతోందని వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వెలసిన నేల నుంచి తాను వచ్చానని ప్రస్తావించారు. ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక్కసారైన తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారని అన్నారు. శ్రీశైలం, అహోబిలం, అన్నవరం, సింహాచలం లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏపీలో ఉన్నాయని ప్రస్తావించారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో నిర్మిస్తున్నామని.. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏపీతో కలిసి పనిచేయాలి..
అభివృద్ధి అంటే కేవలం ఆర్ధిక ప్రగతి, టెక్నాలజీ మాత్రమే కాదని.. ప్రజల జీవన ప్రమాణాలు మార్చటమేనని తాను భావిస్తున్నానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతీ పౌరుడూ శాంతి సౌఖ్యాలు, ఆనందంగా జీవించాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. ఏపీ సమీకృత అభివృద్ధి సాధించాలన్నదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏపీలోని ప్రతీ పౌరుడికి అత్యుత్తమ జీవన ప్రమాణాలు కల్పించేలా తాము సంకల్పం తీసుకున్నామని వివరించారు. అందుకే పీ4 లాంటి కార్యక్రమాలు చేపట్టామని.. స్వర్ణాంధ్ర 2047 విజన్ కూడా అమలు చేశామని ప్రస్తావించారు. సాంకేతికత సాయంతో ఏపీని గ్లోబల్ ఎకానమీలో ఓ కీలకమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అదే సమయంలో ఎలాంటి ఒత్తిడి లేని సమాజాన్ని కూడా తీసుకురావాలని అన్నారు. విధానకర్తగా తాము అభివృద్ధి వైపుగానే ఆలోచన చేయగలమని తెలిపారు. దీనికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు ఏపీతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ విలువలను తాము ప్రపంచానికి చాటి చెబుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News