అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:32 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అండ్ కో అమరావతిపై పగబట్టారని ధ్వజమెత్తారు.
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అండ్ కో అమరావతిపై పగబట్టారని ధ్వజమెత్తారు. రైతులు చేసిన త్యాగాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ నేతలకు అమరావతి లాంటి నగరాలు రావడం ఇష్టం లేదని దుయ్యబట్టారు. ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి పనుల గురించి సీఎం చర్చించారు.
ఏడీబీకి ఫిర్యాదు చేస్తున్నారు..
ఈ క్రమంలో రాజధాని అమరావతిపై వైసీపీకి చెందిన వ్యక్తులు అదే పనిగా ప్రపంచ బ్యాంక్, ఏడీబీకి ఫిర్యాదు చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులు చేసిన పోరాటానికి గుర్తుగా అమరావతిలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు. తప్పనిసరిగా చేద్దామని సీఎం చంద్రబాబు బదులిచ్చారు. హార్టీకల్చర్ హబ్‌ను డిసెంబరు 1వ తేదీన ప్రారంభిస్తున్నామని మంత్రులకు వివరించారు. హార్టికల్చర్ హబ్ అమలుకు ప్రత్యేక మిషన్ కూడా ఏర్పాటు చేసి ఒక సీఈవోను కూడా నియమిస్తున్నామని తెలిపారు.
ఆదిత్య రంగానికి రుషికొండ ప్యాలెస్..
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌ను ఆదిత్య రంగానికి ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ సూచించింది. ఈ సబ్ కమిటీ రిపోర్ట్‌ను మంత్రివర్గం ముందు అధికారులు ఉంచి వివరణ ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్‌కి సంబంధించి ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్)ను అధ్యయనం చేసి 120 రోజుల్లో పని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల సందర్శనార్దం ఉంచుదామని గతంలో అనుకున్నాం కదా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ప్రజలకు జగన్ చేసిన దుబారా ఏంటో తెలియచేద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు పర్యాటక శాఖ తగిన ఏర్పాట్లను వెంటనే చేయాలని సూచించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో కొఠియా గ్రామాలపై కేసులు, అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్న అంశాన్ని ఏపీ గిరిజన శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి వివరించారు. ఈ విషయంపై ఒడిశా సీఎస్‌తో మాట్లాడాలని.. ఏపీ సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే తాను కూడా మాట్లాడతానని సీఎం చెప్పారు. పెట్టుబడిదారుల రక్షణ చట్టాన్ని వెంటనే ఆమోదించాలని తెలిపారు. జనవరి నాటికి ఆమోదించి, కేంద్రానికి పంపాలని సూచించారు.
ప్రాజెక్టులపై ప్రణాళికలను రూపొందించాలి..
ఏప్రిల్ 1వ తేదీ నాటికి కేంద్రంతో ఆమోదించి అమల్లోకి తీసుకువద్దామని సీఎం వెల్లడించారు. ఏపీలో ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంబంధించి ఒక క్యాలెండర్‌ను రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎంఓయూ చేయడమే కాకుండా, ఆయా ప్రాజెక్టుల పనులను ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తి అవుతుంది, ఎప్పుడు ఓపెన్ చేస్తామనేది కూడా ఓ ప్రణాళిక అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక శాఖలో పన్నుల వసూళ్లకు సంబంధించి ఏఐ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేస్తున్నామని అధికారులు వివరించారు. దీని ద్వారా మిగతా రాష్ట్రాలకు కూడా మనం సర్వీసు ప్రొవైడర్లుగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. లీడర్ షిప్, టెక్నాలజీ, నాలెడ్జ్ (ఎల్‌టికే) ఉండాలని, దీని వల్ల అందరు శక్తివంతులవుతారని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News