Share News

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 26 , 2026 | 02:32 PM

తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో అపూర్వఘట్టం ఇవాళ ఆవిష్కృతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుమలను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

తిరుమల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో అపూర్వఘట్టం ఇవాళ ఆవిష్కృతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుమలను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను చెన్నైకు చెందిన జైన్ దంపతులు ఈరోజు (గురువారం) సమర్పించారు. అనంతరం వర్ధమాన్ జైన్, రాధికా జైన్‌తో కలిసి తిరుమలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి మాట్లాడారు. శ్రీవారికి భారీ ఎత్తున విరాళం సమర్పించిన జైన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి వైభవం మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. తిరుమల అంటే భక్తి, విశ్వాసం,ఆధ్యాత్మిక ఆనందమని చెప్పుకొచ్చారు.


మరెక్కడా దొరకనటువంటి దివ్యానూభుతి తిరుమల క్షేత్రంలోనే లభిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. శ్రీవారికి జైన్ దంపతులు బంగారు ఆభరణాలు సమర్పించారని అన్నారు. టీటీడీ అర్చకులు, ప్రతినిధులు ఆ అభరణాలను స్వీకరించారని తెలిపారు. శ్రీవారి ఆదేశంతో 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చామని జైన్ దంపతులు చెప్పారని అన్నారు. ప్రతి రోజూ స్వామివారికి 121 కిలోల బంగారు ఆభరణాలు ధరిస్తారని తెలిపారు. ఈ అపూర్వ ఘట్టంలోతాను భాగస్వామిని కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వజ్రాలు కూడా ఉన్నాయని వివరించారు.


రూ.200 కోట్ల విలువైన ఆభరణాలను శ్రీవారికి విరాళంగా ఇవ్వడం అపూర్వమైన సంఘటన అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. శ్రీవారిపై భక్తి, విశ్వాసాలతో జైన్ దంపతులు ముందుకు వచ్చారని కొనియాడారు.శ్రీవారిని మొక్కుకున్న వారు అత్యంత భక్తి శ్రద్ధలతో విలువైన కానుకలు సమర్పిస్తారని వెల్లడించారు. అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు నుంచి ఇప్పుడు జైన్ దంపతుల వరకు శ్రీవారిపై భక్తి, విశ్వాసం పెరుగుతునే ఉన్నాయని తెలిపారు. పల్లవ, చోళ, పాండ్యా రాజులు వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారని వివరించారు. మైసూర్, మరాఠా రాజులు అనేక ఆభరణాలు, కానుకలు, ఆస్తులు శ్రీవారికి ఇచ్చారని ప్రస్తావించారు.


విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు హిందూ మతాన్ని పరిరక్షించారని సీఎం కొనియాడారు. శ్రీకృష్ణ దేవరాయలకు తిరుమల వేంకటేశ్వర స్వామికి అనేక ఆభరణాలను అందించారని గుర్తుచేశారు. శ్రీకృష్ణ దేవరాయలు అందించిన రత్నకిరీటం, పీతాంబరానికి ఎంతో చరిత్ర ఉందని ఉద్ఘాటించారు. పూర్వ కాలంలో దేవాలయాల మీద చాలా దాడులు జరిగాయని తెలిపారు. కానీ వేంకటేశ్వరస్వామి దేవాలయం విషయంలో ఎవ్వరూ ఆ సాహసానికి ఒడిగట్టలేదని అన్నారు. రోజురోజుకూ శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని పెంపోందించడానికి చాలా మంది కృషి చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఆధ్యాత్మికత, ధర్మం మనిషికి ఎంతో సంతోషానిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. 5వేల దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎక్కడా దొరకని దివ్యానుభూతి తిరుమలలో దొరుకుతుందని అన్నారు. తిరుమలలో ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఎల్‌నినో కారణంగా తిరుమలలో నీటి ఎద్దడి వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. 1999లోనూ ఇలాంటి పరిస్థితే వస్తే.. 49 రోజుల్లో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. తిరుమలలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 03:14 PM