ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Feb 12 , 2026 | 09:15 AM
అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కోనసీమ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): సాంకేతికత పెరిగిన కొద్దీ నేరాలు కూడా సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యవంతంగా మారినప్పటికీ, వాటి వెనుక ఉన్న ప్రమాదాలను గుర్తించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో (Konaseema Cyber Crime) పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మోసం ఆన్‌లైన్ షాపింగ్‌లో జాగ్రత్తల ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తోంది.
ఘటన వివరాలిలా..
అమలాపురం పట్టణంలోని దుడ్డు వారి అగ్రహారం ప్రాంతానికి చెందిన జయంతి సురేశ్ అనే వ్యక్తి పీఎంపీ వైద్యుడిగా (Private Medical Practitioner) ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన ఇంటర్నెట్ చూస్తుండగా, అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు విక్రయిస్తామనే ఒక వెబ్‌సైట్ ప్రకటన ఆయన దృష్టిలో పడింది. ఆ వెబ్‌సైట్‌లో కేవలం రూ.2,000లకే ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్ వస్తుందని నమ్మిన సురేశ్, వెంటనే ఆ ఫోన్‌కు ఆర్డర్ పెట్టారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి, తన ఆర్డర్ కోసం ఎదురుచూశారు. కొద్ది రోజుల తర్వాత, సదరు వెబ్‌సైట్ నిర్వాహకులు ఒక పార్శిల్ పంపారు. ఎంతో ఆశగా ఆ పార్శిల్ తెరిచి చూడగా, అందులో ఉన్న ఫోన్ అస్సలు పనిచేయకపోవడంతో వైద్యుడు సురేశ్ షాక్‌కు గురయ్యారు. ఇది మోసమని గ్రహించిన ఆయన వెంటనే ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.
రీఫండ్ పేరుతో మాయాజాలం..
పనిచేయని ఫోన్ రావడంతో సురేశ్ వెబ్‌సైట్‌లో ఉన్న కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వైపు ఉన్న నేరగాళ్లు చాలా నమ్మకంగా మాట్లాడారు. మీరు చెల్లించిన రూ.2,000 వెంటనే రిఫండ్ (Refund) చేస్తామని నమ్మబలికారు. ఇందుకోసం ఒక ప్రక్రియ పూర్తి చేయాలని చెబుతూ, వారి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ (One Time Password) నంబర్లను చెప్పమని కోరారు. రిఫండ్ వస్తుందనే నమ్మకంతో సురేశ్, ఆ నేరగాళ్లు అడిగిన ఓటీపీ నంబర్లను వెల్లడించారు.
బ్యాంక్ ఖాతా ఖాళీ..
సురేశ్ ఓటీపీ నంబర్లు చెప్పిన వెంటనే, నేరగాళ్లు వారి అసలు స్వరూపాన్ని చూపించారు. రీఫండ్ రావడానికి బదులుగా, సురేశ్ ఖాతా నుంచి ఏకంగా రూ.49,500 రెండు దఫాలుగా మాయమయ్యాయి. తన ఖాతా నుంచి భారీగా నగదు కట్ అయిందనే మేసేజ్ చూసిన సురేశ్, తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. అసెంబ్లీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం
Read Latest Telangana News And AP News And Telugu News