పుంగనూరు ఘటన.. నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:25 AM
అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పుంగనూరు ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.
చిత్తూరు, అక్టోబర్ 17: పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పుంగనూరు ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పుంగనూరు, కుప్పం ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో నిఘా ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వ్యక్తులను కట్టుదిట్టమైన పోలీసుల తనిఖీలతో కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. మరోవైపు నిన్నటి పుంగనూరు ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిన్నటి ఘటనలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతం పుంగనూరు, తిరుపతి, సీఎంసీ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
కాగా.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే వైసీపీ రెచ్చిపోయింది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాన్వాయ్‌తో వచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీభత్సం సృష్టించారు. పుంగమ్మ చెరువు కట్ట వద్ద రోడ్డుపై ఉన్న కూటమి నేతలను కాన్వాయ్‌లో ఉన్న వాహనం ఢీకొట్టడంతో పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో రాళ్లు, కర్రలు, రాడ్లతో వచ్చిన మిథున్ రెడ్డి అనుచరులు.. టీడీపీ శ్రేణులపై దాడులు చేసి అరాచకం సృష్టించారు. దీంతో టీడీపీ నేతలు కూడా ప్రతిగా దాడులు చేశారు. ఇరువర్గాలు పరస్సరం దాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆపై మధ్యాహ్నం తర్వాత టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. పుంగనూరులో వైసీపీ సృష్టించిన విధ్వంసంపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
78వ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్.. ఓవరాల్ టాపర్‌గా గౌరవ్ ఉప్పల్
పుంగనూరులో వైసీపీ దాడులపై బోండా ఉమ ఫైర్.. మిథున్ రెడ్డి అరెస్ట్‌కు డిమాండ్
Read Latest AP News And Telugu News