78వ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్.. ఓవరాల్ టాపర్‌గా గౌరవ్ ఉప్పల్
ABN , Publish Date - Oct 17 , 2026 | 10:03 AM
హైదరాబాద్‌లో 78వ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ముగిసింది. పరేడ్‌కు పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ ట్రైనీ అధికారి గౌరవ్ ఉప్పల్ నాయకత్వం వహించారు. 78వ బ్యాచ్ ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఓవరాల్ టాపర్‌గా గౌరవ్ ఉప్పల్ నిలిచారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: నగరంలో 78వ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ముగిసింది. పరేడ్‌కు పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ ట్రైనీ అధికారి గౌరవ్ ఉప్పల్ నాయకత్వం వహించారు. 78వ బ్యాచ్ ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఓవరాల్ టాపర్‌గా గౌరవ్ ఉప్పల్ నిలిచారు. ప్లాటూన్ వన్ కమాండర్‌గా తమిళనాడు కేడర్ ఐపీఎస్ ట్రైనీ శివ చంద్రన్ నాయకత్వం వహించారు. రెండో ప్లాటూన్ కమాండర్‌గా తమిళనాడు కేడర్ ట్రైనీ ఐపీఎస్ కవిన్ మోజీ, మూడో ప్లాటూన్ కమాండర్‌గా రాజస్థాన్ క్యాడర్ ట్రైనీ ఐపీఎస్ తేజస్వి దేశ్ పాండే నాయకత్వం వహించారు.
నాలుగో ప్లాటూన్ కమాండర్‌గా రాయల్ భూటాన్ పోలీస్‌కు చెందిన లేక్ జిన్ పెల్డెన్ లామో, ప్లాటూన్ ఐదుకు గుజరాత్ క్యాడర్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్ కుహూ గార్గ్, ఆరో ప్లాటూన్‌కు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ముకుంద సింగ్ నాయకత్వం వహించారు. మౌంటెడ్ ప్లాటూన్‌కు కేరళ క్యాడర్ ట్రైనీ ఐపీఎస్ రిషబ్ భట్ నాయకత్వం వహించారు. ట్రైనింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐపీఎస్ ప్రొబేషనర్లకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్.. కప్పులు, ట్రోఫీలను ప్రదానం చేశారు. ఉత్తమ అవుట్డోర్ ప్రొబేషనర్‌గా కుహూ గార్గ్‌కు ఐపీఎస్ అసోసియేషన్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్ కప్ అందజేశారు.
అవుట్డోర్ సబ్జెక్టుల్లో ప్రావీణ్యతకు బీఎస్ఎఫ్ ట్రోఫీని లెక్జిన్ పెల్డెన్ లామో అందుకున్నారు. ఈక్విటేషన్లో ప్రతిభకు గాను రిషబ్ భట్‌కు టోంక్ కప్ దక్కింది. పోలీస్ సైన్సెస్‌లో ప్రతిభకు గాను శివచంద్రన్కు ఎన్ఎఫ్ఎస్యూ ట్రోఫీ, న్యాయశాస్త్రంలో ప్రతిభకు ఆరుషి శర్మికు మణిపూర్ కప్ ఫర్ లాను అందజేశారు. అంతేకాకుండా కంప్యూటర్ అధ్యయనాల్లో ప్రతిభ కనబరిచిన శివచంద్రన్కు ఎన్సీఆర్బీ ట్రోఫీ వరించింది. ఫేజ్ వన్‌లో ఉత్తమ విదేశీ ప్రొబేషనర్‌గా డైరెక్టర్ ట్రోఫీని లెక్జిన్ పెల్డెన్ లామో అందుకోగా.. ఫేజ్ వన్‌లో ఉత్తమ ప్రొబేషనర్‌గా గౌరవ్ ఉప్పల్‌కు.. డైరెక్టర్ ట్రోఫీని అందజేశారు.
కొత్త ఐపీఎస్ బ్యాచ్ ఐదు ప్రధాన సవాళ్లను ఎదుర్కోవాలి: గోవింద్ మోహన్
గత కొన్ని దశాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న అంతర్గత భద్రతా పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తెలిపారు. గత 50 ఏళ్లుగా వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, స్వదేశీ , విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. దేశంలో మావోయిజం ముగింపు దశకు చేరుకుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు తగ్గినా, ప్రస్తుతం అక్కడ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్లు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాలు, ఆపరేషన్ల నిలిపివేత ఒప్పందాలు, త్రైపాక్షిక ఒప్పందాల ద్వారా తిరుగుబాటు గ్రూపులు శాంతియుత స్రవంతిలోకి వచ్చాయన్నారు.
స్వదేశీ ఉగ్రవాదం తగ్గినప్పటికీ, పూర్తిగా అంతరించిపోలేదని గోవింద మోహన్ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటన ఉగ్రవాద ముప్పు ఇంకా ఉందని సూచిస్తోందన్నారు. ఈ కొత్త ఐపీఎస్ బ్యాచ్ రాబోయే రోజుల్లో ఐదు ప్రధాన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ క్రైమ్, ఉగ్రవాదం, విదేశీయుల అక్రమ వలసలు, డార్క్ నెట్ ద్వారా సుపారీ హత్యలు, విదేశాలకు డబ్బులు తరలింపు సమస్యగా మారనున్నాయని అన్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలను పోలీసింగ్‌లో సమర్థంగా వినియోగించాలన్నారు. దేశ ప్రజలకు భద్రత, రక్షణ, భరోసా కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. ప్రజలు ప్రధానంగా రెండు రకాల సమస్యలతో అధికారులను ఆశ్రయిస్తారని.. ఈ విషయాన్ని గుర్తించుకోవాలని తెలిపారు. ప్రజలతో పోలీసులు ఎలా ఉండాలో సూచించడానికి మహాభారతంలోని సభాపర్వాన్ని గోవింద్ మోహన్ ఉదాహరించారు.
ఇవి కూడా చదవండి..
ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?
విజయవాడలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా కనకదుర్గమ్మ
Read Latest Telangana News And Telugu News