ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?
ABN , Publish Date - Oct 17 , 2026 | 09:16 AM
టెస్లా ఆవిష్కరించిన ‘ఎగిరే కారు’ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఫ్లయింగ్ రోడ్‌స్టర్ కేవలం అడ్వాన్స్డ్ టెక్నాలజీకి చిన్న శాంపిల్ మాత్రమే అని టెక్ నిపుణులు అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ‘ఫ్లయింగ్ కారు’ను అలా ఆవిష్కరించిందో లేదో ఇలా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఎగిరే కారు అంటూ ఆ సంస్థ విడుదల చేసిన వీడియో వైరలైపోయింది. అందరూ ఆ కారు గురించే మాట్లాడుకుంటున్నారు. టెస్లా సాంకేతికతను చూసి అవాక్కవుతున్నారు. అయితే ఈ ఫ్లయింగ్ రోడ్‌స్టర్ కేవలం అడ్వాన్స్డ్ టెక్నాలజీకి చిన్న శాంపిల్ మాత్రమే అని, ప్రస్తుతం టెస్లా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్‌లు ప్రపంచాన్ని మరింత ఆశ్చర్యపరుస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. హ్యూమనాయిడ్ రోబోలు, రోబోట్యాక్సీలను ఆ సంస్థ తయారు చేస్తోందని అంటున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల గురించి సవివరంగా తెలుసుకుందాం.
పనులు చేసిపెట్టే టెస్లా ఆప్టిమస్..
టెస్లా అభివృద్ధి చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో పేరే ఆప్టిమస్. మనుషులు చేసే, చేయలేని ప్రతి పనీ ఇది చేయగలదని ఎలాన్ మస్క్ వివరించారు. మనం చేయలేని ప్రమాదకరమైన పనులు, మనకు బోర్ కొట్టే పనులు టెస్లా ఆప్టిమస్ సులభంగా చేస్తుందని ఆయన తెలిపారు. దీని సహాయం ఇంటికే పరిమితం కాదని, కర్మాగారాలు, పరిశ్రమల్లో ఈ హ్యూమనాయిడ్ రోబో తన సేవలు అందిస్తుందని చెప్పుకొచ్చారు. కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే టెస్లా ఆప్టిమస్ మున్ముందు కాలంలో అద్భుతాలు చేయనుంది.
రాబోతోంది రోబోట్యాక్సీ..
టెస్లా అభివృద్ధి చేస్తున్న మరో కీలక ప్రాజెక్ట్ రోబోట్యాక్సీ. అంటే డ్రైవర్ లేని ట్యాక్సీ అన్నమాట. కృత్రిమ మేధ ఈ ట్యాక్సీలను నడపబోతోంది. ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను టెస్లా తయారు చేసింది. ఇప్పుడు డ్రైవర్‌లెస్ ట్యాక్సీలను తీసుకురాబోతోంది. రోబోట్యాక్సీల కారణంగా ప్రయాణం మరింత సులభంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుందని ఆ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఈ సర్వీసులను అమెరికాలోని ఆస్టిన్ నగరంలో టెస్లా అందిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే పలు సాంకేతిక లోపాలను, భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.
కాగా అక్టోబర్ 15న ఫ్లయింగ్ రోడ్‌స్టర్‌ను టెస్లా ఆవిష్కరించింది. కోల్డ్ గ్యాస్ థ్రస్టర్ల సహాయంతో ఈ కారు భారీ వంపు తిరిగిన ర్యాంప్‌పైకి దూసుకెళ్లి, తరువాత తలకిందులుగా ప్రయాణించి, ఆపై గాల్లోకి ఎగిరి సురక్షితంగా నెలపై వాలింది.
ఇవీ చదవండి
టెస్లా రోడ్‌స్టర్ కారు గాల్లో ఎగరడం వెనుక అసలు రహస్యం ఏంటి?
ఐదు రోజులకే పదవి పోయింది.. ట్రంప్ సంచలన నిర్ణయం!