‘పెళ్లి సీటు’కు పొత్తు ఎసరు
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:17 AM
ఆయన.. టీడీపీ నాయకుడు. కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు. మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించారు. అ యితే ఈసారి ఈ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో తన భార్యను ఆ స్థానంలో పోటీ చేయించాలని భావించారు. కానీ...
సాలూరులో టీడీపీ నాయకుడికి చేదు అనుభవం
సాలూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఆయన.. టీడీపీ నాయకుడు. కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు. మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించారు. అ యితే ఈసారి ఈ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో తన భార్యను ఆ స్థానంలో పోటీ చేయించాలని భావించారు. అవివాహితుడైన ఆయన ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్న తన మరదల్ని.. రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన వెంటనే వివాహం చేసుకున్నారు. పెళ్లయితే చేసుకున్నారు కానీ సీటు మాత్రం దక్కలేదు. కూటమి పొత్తులో సీట్ల సర్దుబాటులో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ సీటు జనసేనకు వెళ్లింది.
దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టీడీపీ మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్‌కు ఈ అనుభవం ఎదురైంది. సాలూరు పట్టణంలోని పంతొమ్మిదో వార్డుకు చెందిన హర్షవర్ధన్, అదే వీధికి చెందిన గుళ్ల మంజీరా మరో 6 నెలల్లో వివాహం చేసుకోవాలని భావించా రు. ఈ నెల 12న మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో హర్షవర్ధన్ హుటాహుటిన స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయంలో 13న వివాహం చేసుకున్నారు.
తన భార్యకు టికెట్ వస్తుందని ఆశించారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. తన భార్యకు టికెట్ వస్తుందని భావించి వివాహం చేసుకున్నానని, నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకున్నానని హర్షవర్ధన్ తన స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. హర్షవర్ధన్‌తో మాట్లాడేందుకు ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, ఆయన కన్నీటిపర్యంతమై మాట్లాడలేకపోయారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు