అంతా కొలిక్కి...
ABN , Publish Date - Oct 17 , 2026 | 02:28 AM
పుర పోరుకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగియనుండటంతో మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపికను ప్రధాన పార్టీలు దాదాపు పూర్తిచేశాయి. కూటమిలో భాగంగా జనసేన, బీజేపీలకు కేటాయించిన దర్శి, గిద్దలూరు మినహా మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది.
మున్సిపోల్స్‌కు అభ్యర్థుల ఎంపిక
సీట్ల కేటాయింపుపై కూటమిలో అసంతృప్తులు
గిద్దలూరు, దర్శిలో కొత్త వారిపై బీజేపీ, జనసేన దృష్టి
ఒంగోలులో మహిళకు టీడీపీ అవకాశం
వైసీపీకి చీమకుర్తిలో వీడిన చిక్కుముడి.. దర్శిలోనూ ఓకే
పరిషత్ ఎన్నికలపై కదిలిన గ్రామ నాయకులు
పుర పోరుకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగియనుండటంతో మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపికను ప్రధాన పార్టీలు దాదాపు పూర్తిచేశాయి. కూటమిలో భాగంగా జనసేన, బీజేపీలకు కేటాయించిన దర్శి, గిద్దలూరు మినహా మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. వైసీపీకి సంబంధించి అన్నిచోట్లా పూర్తయ్యింది. ఒంగోలు కార్పొరేషన్లో డివిజన్లు, ఇతర మున్సిపాలిటీల్లో వార్డుల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. బీజేపీ, జనసేనల గొంతెమ్మ కోర్కెలతో టీడీపీ శ్రేణులు అసంతృప్తిలో ఉన్నారని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చీరాలలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయ్యింది. అక్కడ కాంగ్రెస్ నాయకుడు ‘ఆమంచి’ వార్డులకు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. చైర్మన్ అభ్యర్థి విషయంలో ఆయన ఏం చేయబోతున్నారన్న విషయం సస్పెన్షన్‌గా మారింది.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
కార్పొరేషన్, మున్సిపాలిటీలలో నామి నేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాగా ప్రధాన రాజకీయ పక్షాల నుంచి పెద్దగా దాఖలు కాలేదు. అయితే కీలక మైన చైర్మన్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినందున శుక్రవారం రాత్రికి డివిజన్ల అభ్యర్థుల ఎంపికపై కూడా స్పష్టతకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తద్వారా శనివారం డివిజన్, వార్డుల అభ్యర్థుల తోపాటు కొన్నిచోట్ల చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఒంగోలులో టీడీపీ నుంచి మహిళా అభ్యర్థి?
ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పదవి అన్రిజర్వుడ్లో ఉండగా మహిళా అభ్య ర్థిని రంగంలో దించేందుకు టీడీపీ సిద్ధ మైనట్లు తెలుస్తోంది. నగరంలో అగ్రవ ర్ణాల్లో అధిక ఓట్లు ఉన్న రెండు సామాజి కవర్గాలకు కలిసొచ్చే విధంగా మహిళా అభ్యర్థి పి.శిల్ప పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తొలుత కాపు సామాజిక వర్గంలో ఒకరిని ఎంపిక చేసేందుకు పరిశీలన జరిగింది. పార్టీలోని ఒక నాయకుడితోపాటు ఒక వ్యాపారి పేరును పరిగణనలోకి తీసుకున్నారు. అయితే వైసీపీ ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెంది న వ్యక్తిని రంగంలోకి దింపింది. దీంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యూహాన్ని మార్చి కాపు సామాజికవర్గానికి చెందిన శిల్పకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆమె కాపు కాగా ఆమె భర్త బాలు ఆర్యవైశ్య సామా జికవర్గానికి చెందిన వారు. గత సాధారణ ఎన్నికలకు ముందు నుంచే ఆయన టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో శిల్ప పేరుతోపాటు మరో మూడు పేర్లపై ఐవీఆర్ఎస్ సర్వేకు శ్రీకారం పలికారు. విశ్వసనీయ సమాచారం మేరకు శిల్పకు ఆధిష్ఠానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. వైసీపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్‌ను రంగంలో దించనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మేయర్ అభ్యర్థిని పోటీలో దించాలని నిర్ణయం తీసుకుంది. ఇక జనసేనలో ఒడా చైర్మన్ రియాజ్ వర్గం యాక్టివ్‌గా ఉండగా, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం సైలెంట్ అయింది. ఈ ఎన్నికల వరకు బాలినేని కూడా దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే నామినేషన్ల దాఖలు అనంతరం జనసేన అధిష్ఠానం ఆయనతో మాట్లాడి ప్రచారానికి పంపుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది.
దర్శి, గిద్దలూరుల్లో కసరత్తు
దర్శి జనసేనకు కేటాయించటంతో అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది. కొద్దినెలల క్రితం టీడీపీ నుంచి జనసేనలో చేరిన ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన కోటా హనుమంతరావు పేరును పరిశీలించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో ఆయన పట్ల ఏమాత్రం సానుకూలత రాలేదని తెలిసింది. దీంతో శుక్రవారం రాత్రి కాపు సామాజికవర్గానికి చెందిన దారం సుబ్బారావు అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే ప్రారంభించారు. సర్వే ప్రకారం అయితే దారం సుబ్బారావు అభ్యర్థి కావచ్చని తెలుస్తోంది. గిద్దలూరు బీజేపీకి కేటాయించడంతో దీటైన అభ్యర్థి లేక ఆ పార్టీ సతమతమవుతోంది. గిద్దలూరులోని ఒకరిద్దరు నాయకులపై పరిశీలన జరిగింది. కనీస సానుకూలత కూడా ప్రజల నుంచి రాలేదు. దీంతో ముత్తుముల కృష్ణకిశోర్రెడ్డిని బీజేపీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే విషయంపై పరిశీలన చేస్తున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి ఆయన స్వయానా సోదరుడు. ఇక మార్కాపురం నుంచి టీడీపీ తరఫున వక్కలగడ్డ మల్లికార్జున్, వైసీపీ నుంచి డాక్టర్ కనకదుర్గ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అద్దంకిలో టీడీపీ అభ్యర్థిగా కాకాని అశోక్, వైసీపీ అభ్యర్థిగా వి.సురేష్ పేర్లను ఖరారు చేశారు. చీరాలలో టీడీపీ నుంచి ఎరిచర్ల హనీష్స్పందన పేరు దాదాపు ఖరారైంది. వైసీపీ నుంచి డాక్టర్ విస్తర్ల షెర్లీ పేరు ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్‌లో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థులను రంగంలోకి దించితే త్రిముఖ పోటీ అవుతుంది. ఇప్పటికే కొన్ని వార్డుల నుంచి అభ్యర్థులను రంగంలో దింపేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి తండ్రి ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఆమంచి వార్డుల్లో పోటీకే పరిమితమవుతారా? లేక చైర్మన్ అభ్యర్థిని రంగంలో దించుతారా? అన్నది తేలాల్సి ఉంది.
వైసీపీ నుంచి చైర్మన్ అభ్యర్థులు ఓకే
వైసీపీ అధినేత జగన్ సూచన మేరకు పోటీకి ఆ పార్టీ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మె ల్యేలు ససేమిరా అనడంతో అధిష్ఠానమే అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభిం చింది. ఎన్నికలు జరగబోయే అన్ని మున్సి పాలిటీలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దర్శి చైర్మన్ అభ్యర్థిగా ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డిని ప్రకటించింది. చీమకుర్తి విషయంలో రాత్రి వరకూ ఉత్కంఠ కొనసాగింది. అక్కడ మస్తాన్‌రెడ్డి అనే నాయకుడిని రంగంలో దించాలని శివప్రసాద్‌రెడ్డి భావించారు. అయితే ఇటీవల ఆయన తన ఓటును చీమకుర్తిలో తొలగించుకొని తన స్వగ్రామంలో మాత్రం ఉంచుకున్నారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో ఓటు లేకపోతే పోటీ చేయవచ్చా? లేదా? అన్న సంశయం నెలకొంది. ఎట్టకేలకు రాత్రికి మేడగం శ్రీదేవి పేరును ఖరారు చేశారు. గిద్దలూరులో ఇద్దరు అభ్యర్థుల మధ్య వైసీపీలో పోటీ నడిచింది. చివరకు భూమా నరసింహారెడ్డి పేరును ప్రకటించారు.