పెట్టుబడుల జోరు
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:35 AM
భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు సన్నాహంగా నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సుల్లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. అమరావతి సదస్సు ద్వారా రాష్ట్రానికి కొత్తగా మరో రూ. 42,947.74 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
అమరావతి సీఐఐ ప్రాంతీయ సదస్సులో 42,947 కోట్లకు ఒప్పందాలు
56,653 మందికి ఉపాధి అవకాశాలు
60 కంపెనీలతో ఎంవోయూలు
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు సన్నాహంగా నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సుల్లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. అమరావతి సదస్సు ద్వారా రాష్ట్రానికి కొత్తగా మరో రూ. 42,947.74 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటితో 56,653 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ సదస్సులో 60 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నవంబరు 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు సన్నాహంగా శుక్రవారం అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో పెట్టుబడుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.
ఏపీఈడీబీ-సీఐఐ కలిసి నిర్వహించిన ఈ సదస్సులో ఆయా కంపెనీల ప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. అమరావతి రాజధాని పరిధిలో రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి, హోటళ్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంధన, విమానయాన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయి. రాజధాని ప్రాంతంలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ప్రకాశం జిల్లాలో గ్రెటా గ్రూప్ రూ. 10,500 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. గుంటూరు జిల్లాలో బంగారం, ఆభరణాల పారిశ్రామిక పార్కులు, ఇతర పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నౌకా నిర్మాణం, సముద్ర ఇంజనీరింగ్, క్రూయిజ్ సేవలు, లాజిస్టిక్స్, పెట్రో కెమికల్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. తిరుపతి జిల్లాలో హయర్ అప్లయెన్సెస్ సంస్థ రూ. 7 వేల కోట్లు, కార్బన్ కాస్మో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సంస్థ రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.
అమరావతిలో ధన్య మాజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ. 1,000 కోట్లు, డ్రీమ్వాలీ సంస్థ గోల్ఫ్ రిసార్ట్ అభివృద్ధికి రూ.1,000 కోట్లు, మాగ్నం వింగ్స్ సంస్థ విమానయాన రంగంలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రంలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు సంబంధించి 11 ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ సుమారు రూ. 2,518.34 కోట్లు కాగా.. ఈ పెట్టుబడులను రిసార్టులు, హోటళ్లు, నదీ తీర పర్యాటక కేంద్రాలు, బీచ్ ఆధారిత పర్యాటక ప్రాజెక్టుల్లో పెట్టనున్నారు. వీటి ద్వారా 6,726 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
అవకాశాలను అందిపుచ్చుకోండి
సదస్సులో అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పనడానికి అనువుగా ఉన్న సహజ వనరులు, మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకుని పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ప్రస్తుతం 46 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. 26 ఎంఎస్ఎంఈలకు 480 ఎకరాల భూములు కేటాయించినట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో బీపీసీఎల్ రిఫైనరీ, దోనేపూడిలో భారత డైనమిక్స్ యూనిట్ రానుందని చెప్పారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
106 ఒప్పందాలు.. 1.27 లక్షల మందికి ఉపాధి
ఈ ప్రాంతీయ సదస్సు కన్నా ముందు విశాఖపట్నం, కాకినాడల్లో కూడా ఇదే తరహాలో పెట్టుబడుల ప్రాంతీయ సదస్సులు నిర్వహించారు. మొత్తంగా ఈ మూడు సదస్సుల్లో కలిపి 106 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రూ. 68,702.35 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 1,27,859 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మొత్తం పెట్టుబడుల్లో 60 శాతానికి పైగా అమరావతి సదస్సులోనే సాధించడం విశేషం. ఇది అమరావతి ప్రాంత అభివృద్ధిలో మరో ముందడుగుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు