Share News

గాల్లో ఇండిగో విమానం చక్కర్లు

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:43 AM

తుఫాను ప్రభావంతో తిరుపతి విమానాశ్రయంలో దిగేందుకు వాతావరణం అనుకూలించక పోవడంతో విజయవాడ నుంచి వచ్చిన విమానాన్ని చెన్నైకి మళ్లించారు.

గాల్లో ఇండిగో విమానం చక్కర్లు

  • వాతావరణం అనుకూలించక చెన్నైకి మళ్లింపు

రేణిగుంట, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): తుఫాను ప్రభావంతో తిరుపతి విమానాశ్రయంలో దిగేందుకు వాతావరణం అనుకూలించక పోవడంతో విజయవాడ నుంచి వచ్చిన విమానాన్ని చెన్నైకి మళ్లించారు. విజయవాడ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.45గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం మధ్యాహ్నం 3.20గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. అయితే తిరుపతి ప్రాంతంలో భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలించ లేదు. దీంతో సుమారు గంట పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. సాయంత్రం 4.30గంటలకు చైన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండయింది. మరోవైపు హైదరాబాద్‌, విశాఖ నుంచి తిరుపతికి వచ్చిన ఇండోగో విమానాలు సుమారు గంట ఆలస్యంగా నడిచాయి.

తిరుపతి విమానాశ్రయంలో కూలిన గోడలు

శుక్రవారం కురిసిన భారీవర్షానికి తిరుపతి విమానాశ్రయం జలమయమైంది. కొత్త టెర్మినల్‌ వీఐపీ గేటు, పాత విమానాశ్రయం వీఐపీ గేటు వద్ద ప్రహరీలు కూలిపోయాయి. దీంతో వర్షపు నీరు రన్‌వేపైకి చేరుకుంది. ఆ పరిసరాల్లోని డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో వర్షపునీరు బయటకు వెళ్లే మార్గంలేక గోడలు కూలి ఉంటాయని భావిస్తున్నారు. విమానాశ్రయ ఇన్‌చార్జి డైరెక్టరు భూమినాథన్‌ మాట్లాడుతూ రన్‌వే పరిసరాల్లోని ప్రహరీల నుంచి వర్షపునీరు లోపలికి ప్రవేశించిందన్నారు. కూలిన గోడల వద్ద తాత్కాలికంగా బారికేడ్లు ఏర్పాటు చేసి, వారంలోపు గోడలు పునర్నిర్మిస్తామని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 05:43 AM