పుంగనూరులో వైసీపీ దాడులపై బోండా ఉమ ఫైర్.. మిథున్ రెడ్డి అరెస్ట్‌కు డిమాండ్
ABN , Publish Date - Oct 17 , 2026 | 10:41 AM
స్థానిక సంస్థల ఎన్నికలలో అరాచకాలు, దాడులు చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపణలు గుప్పించారు.
విజయవాడ, అక్టోబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికలలో అరాచకాలు, దాడులు చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపణలు గుప్పించారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏకగ్రీవాలు కాకుండా ఎన్ని దాడులు చూశారో అందరూ చూశారని.. ఇప్పుడు పుంగనూరులో కూడా అదే సంస్కృతి మొదలు పెట్టారని మండిపడ్డారు. ఒక నామినేషన్‌కు వందల మంది ఎందుకని ప్రశ్నించారు. కాన్వాయ్‌గా వచ్చి కారుల్లో కత్తులు, కర్రలు, రాళ్లు తీసుకువచ్చారని.. ఎన్నికల నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరూ హింసనే నమ్ముకున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇంతకాలం వారు గెలిచింది కూడా ఇదే విధానంలో అంటూ విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కూడా దాడులు చేస్తామనే సంకేతాలను పంపారన్నారు. మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్వత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశా రు. పోలీసులు, మీడియా, అధికారుల సాక్షిగా ఈ దాడులు చేశారన్నారు. వైసీపీ గత, ప్రస్తుత చరిత్ర తీసుకుని పార్టీని రద్దు చేయాలని అన్నారు. గొడ్డలి పార్టీ పేరుకు తగిన విధంగా భయపెట్టాలని చూస్తోందని ఫైర్ అయ్యారు.
భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల నామినేషన్ పత్రాలను లాక్కోవడం చూశారని బోండా ఉమ అన్నారు. పోటీ చేసే అభ్యర్థులను భయపెట్టాలని చూస్తున్న వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పాలని.. ఆ పార్టీకి ఒక్క ఓటు పడినా అది నిరుపయోగమే అని చెప్పుకొచ్చారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలని, దాడిలో పాల్గొన్న పుష్పాలపై టాడా యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ఎన్నికల సంఘం ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరించాలన్నారు. అసలు కాన్వాయ్‌గా అక్కడకు రావాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులపై కారులు ఎక్కించి, తొక్కించారని.. వారి అరాచకాలు భరించలేక తెలుగుదేశం కార్యకర్తలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎదురు తిరిగారని చెప్పుకొచ్చారు. ఈ దాడికి కర్త అయిన మిథున్ రెడ్డిని ఎంపీగా తప్పించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వైసీపీ గొడ్డలి పార్టీ, ఆకు రౌడీలు చేసే అరాచకాలను పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఎమ్మెల్యే తెలిపారు. వాళ్లే దాడులు చేస్తారు, వాళ్లే కేంద్ర బలగాలను కోరతారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అన్ని పోలీంగ్ బూత్‌లలో వెబ్ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. విజయవాడ మేయర్ జనసేనకు ఇచ్చామని.. వారు పోటీ చేస్తారని తెలిపారు. డివిజన్ల అభ్యర్థుల ఎంపిక ఈరోజు పూర్తవుతుందని చెప్పారు. ఆశావహులు ఎంతమంది ఉన్నా.. పార్టీ అధిష్ఠానం చెప్పిన వారే అభ్యర్థులని తేల్చిచెప్పారు. ముందుగా ఎవరైనా నామినేషన్ వేసినా కూడా.. పార్టీ బీఫాం ఇచ్చిన వారే అభ్యర్థులన్నారు. ఇతరులు ఎవరైనా నామినేషన్లు వేసినా విత్ డ్రా చేసుకోవాల్సిందే అని తెలిపారు. కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం అంతా కలిసి పని చేస్తామని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
విజయవాడలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా కనకదుర్గమ్మ
78వ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్.. ఓవరాల్ టాపర్‌గా గౌరవ్ ఉప్పల్
Read Latest AP News And Telugu News