సరిచేయండి చిన్న బాస్..!
ABN , Publish Date - May 13 , 2026 | 10:59 AM
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అనంతపురానికి వస్తున్నారు. అర్బన్ కార్యకర్తలతో ఆయన గురువారం సమావేశం కానున్నారు.
నేతల తీరుపై శ్రేణుల్లో ఆవేదన
టీడీపీ క్యాడర్‌తో రేపు లోకేశ్ సమీక్ష
అభివృద్ధి చేస్తారు.. చెప్పుకోరు
విభేదాలు.. వివాదాలతో నష్టం
అనంతపురం: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అనంతపురానికి వస్తున్నారు. అర్బన్ కార్యకర్తలతో ఆయన గురువారం సమావేశం కానున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఆయన పర్యటన కీలకంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనంతలో అభివృద్ధి ఎంత వేగంగా సాగుతోందో.. వివాదాలూ అంతే వేగంగా చుట్టుముడుతున్నాయి. వివాదాల వెనుక పార్టీ గ్రూప్ పాలిటిక్స్, కొందరి పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను టార్గెట్ చేసి వివాదాలు సృష్టిస్తున్నారనే ప్రచారమూ ఉంది.
ప్రభుత్వం ఏర్పడ్డాక, గడిచిన 23 నెలలలో వివాదాలకు కాస్త విరామం ఉంటున్నా, అభివృద్ధి మాత్రం నిర్విరామంగా సాగుతోంది. గుంతలమయమైన రోడ్లు బాగుచేశారు. కొత్త రోడ్లు వేశారు. భవనాలు, బ్రిడ్జిలను నిర్మించారు. ఇప్పటిదాకా రూ.150 కోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయి. ‘చేసిన మంచిని ప్రజలకు వివరించడం, గ్రూపు విభేదాలను పక్కన పెట్టి.. ఐక్యంగా ముందుకు సాగడం’ అనే అంశాల ప్రాతిపదికన యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జిల్లాకు తొలిసారి వస్తున్న చిన్న బాస్.. పరిస్థితులను చక్కదిద్దుతారని కార్యకర్తలు ఆశలుపెట్టుకున్నారు.
చేశారు.. చెప్పుకోలేదు..
వైసీపీ పాలనలో అనంతపురం అర్బన్‌లో అభివృద్ధి అంతంతే అని చెప్పాలి. అందుకు భిన్నంగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అభివృద్ధి శరవేగంగా సాగింది. వైసీపీ పాలనకు అప్పటి గుంతల రోడ్లు నిదర్శనంగా నిలిచాయి. అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి ఎన్నికయ్యాక, 50 డివిజన్‌లు, నాలుగు పంచాయతీలకు భారీగా నిధులను తెచ్చారు. నగరపాలక సంస్థకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.06 కోట్లు, ఎన్‌క్యా్‌ప ద్వారా రూ.15.51 కోట్లు, కార్పొరేషన్ పరిధిలోని 133 పనులకు జనరల్ పండ్స్ రూ.35.64 కోట్లు తెచ్చారు. నాలుగు పంచాయతీలకు ఉపాధి హామీ పథకం కింద రూ.5 కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద రూ.14.70 కోట్లు, పీఎంజీఎస్‌వై నిధులు రూ.4.79 కోట్లు తెచ్చారు. మొత్తంగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేశారు. కానీ, కుమ్ములాటల్లో పడి.. చేసిన మంచిని ప్రజలకు చెప్పలేకపోయారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
టార్గెట్ దగ్గుపాటి..!
సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి అర్బన్ నియోజకవర్గంలో వివాదాలు కొనసాగుతున్నాయి. అర్బన్‌లో తెలుగుదేశం పార్టీ రెండు గ్రూప్‌లుగా విడిపోయింది. వర్గ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దగ్గుపాటిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అందరినీ కలుపుకునిపోవాలని ప్రయత్నిస్తున్నా, వివాదాలు మాత్రం ఆయన్ను వీడటం లేదు. నిత్యం ఏదో ఒక కంటెంట్ వైరల్ అవుతోంది. ఎక్కడ ఏ గొడవ జరిగినా ‘ఎమ్మెల్యే’ అనే ప్రచారం జరుగుతోంది. ‘టార్గెట్ దగ్గుపాటి’ అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
ఇది పొలిటికల్ స్ట్రాటజీలో భాగమా, వర్గ రాజకీయమా అన్న స్పష్టత లేక క్యాడర్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇవన్నీ ఎలా ఉన్నా, ప్రజల్లో మమేకం అయ్యేందుకు, క్యాడర్‌కు అందుబాటులో ఉండేందుకు దగ్గుపాటి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేగాన్ని పెంచారు. సమస్యలు ఎన్నున్నా, ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు కలగకుండా, అందరినీ ఏకతాటిపైకి తెస్తే బాగుంటుందని కార్యకర్తలు అంటున్నారు. చిన్న బాస్ పర్యటనతో వివాదాలకు బ్రేక్ పడుతుందని, ఆ దిశగా ఆదేశాలు ఇస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేశ్ పర్యటనపై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
1,300 మందితో సమావేశం
టీడీపీ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ నిర్వహించే ఈ సమావేశంలో 1300 మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. యువనేత పర్యటన నేపథ్యంలో నగరంలో భారీగా స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. రాంనగర్, శ్రీనగర్ కాలనీ, గల్లా టౌన్‌షి్‌ప ప్రాంతాలలో రహదారులన్నీ పసుపుమయం అయ్యాయి. నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 14వ తేదీ రాత్రికి నారా లోకేశ్ అనంతపురం చేరుకుంటారు. రాత్రి 7.30 గంటల నుంచి 10 గంటల వరకూ సమావేశం ఉంటుంది. క్లస్టర్, కో- క్లస్టర్, యూనిట్, కో-యూనిట్, బూత్ ఇన్‌చార్జులు, కో-బూత్ ఇన్‌చార్జులు, నగర కమిటీ, అనుబంధ కమిటీల సభ్యులు సుమారు 1300 మంది సమీక్షలో పాల్గొంటారు. యువనేత సమావేశం కోసం అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అస్సాం సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు
హైదరాబాద్-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News