అదుపులో కల్పన ప్రియుడు!
ABN , Publish Date - May 13 , 2026 | 04:21 AM
విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‌రాయ్ భార్య తనూజ హత్య, ఆయన ఇంట్లో నగదు, బంగారం దోపిడీ కేసుకు సంబంధించి కీలక ముందడుగు పడింది.
రహస్య ప్రాంతంలో సాగుతున్న విచారణ
పోలీసుల అదుపులో ఇంకొందరు నేపాలీలు
పుణెలో ఉంటున్న కల్పన భర్త అజ్ఞాతంలోకి
అంతుచిక్కని అసలు దొంగల ఆచూకీ
హైదరాబాద్ సిటీ, మే 12 (ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‌రాయ్ భార్య తనూజ హత్య, ఆయన ఇంట్లో నగదు, బంగారం దోపిడీ కేసుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఆ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న కల్పన అనే నేపాల్ మహిళే, తన గ్యాంగ్ తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టిందని ప్రాథమిక విచారణలో నిర్ధారించిన నేపథ్యంలో ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని ఓ రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. నేపాల్‌కే చెందిన అతడు, హైదరాబాద్‌లోని మరో ఖరీదైన ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. కల్పన గంటలకొద్దీ ఫోన్‌లో మాట్లాడుతోందని, బయటకు వెళ్లి చాలాసేపటి తర్వాత ఇంటికి వస్తోందంటూ తనతో ఇంటి యజమానురాలు తనూజ చెప్పినట్లు గతంలో అక్కడ పనిచేసి మానేసిన నేపాల్ మహిళ చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ కొనసాగించారు.
ఈ క్రమంలో మరో ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న నేపాల్ యువకుడితో కల్పన సన్నిహితంగా ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఏడాదిగా కల్పన.. మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో పనిచేస్తుండగా.. కల్పన భర్త పుణెలో ఉంటున్నట్లు తేలింది. కల్పన గ్యాంగ్ నగరంలో దోపిడీ చేసి పారిపోయిన అనంతరం పుణెలో ఉన్న ఆమె భర్త అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు. కాగా దోపిడీకి కొన్నిరోజుల ముందు నుంచి కల్పన.. నగరంలో ఉన్న తన ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ.. గంటలకొద్దీ ఫోన్లు మాట్లాడుతుండటంతో ఈ దోపిడీలో అతడి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అసలు దొంగలు ఇంకా పట్టుబడలేదు. వారి కోసం ముంబై, ఢిల్లీ, యూపీ, బిహార్, బెంగళూరులో పోలీసులు గాలిస్తున్నారు.
పుణెలో కల్పన నివాసం ఉండే ప్రాంతంలో ఆమె కటుంబసభ్యులను కొందరిని అదుపులోకి తీసుకొని విచారించినా సమాచారం దొరకలేదని తెలుస్తోంది. ఆ ముఠా చోరీ చేసిన సొత్తును ఇప్పటికే దేశం దాటించేసి ఉంటుందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ అనంతరం జూబ్లీహిల్స్ నుంచి పారిపోయి నాంపల్లిలో రైలెక్కిన కల్పన, ఆమె మరో ఇద్దరు అనుచరులు కాజీపేటలో దిగారు. అక్కడి నుంచి తలోదారిన వెళ్లి.. వివిధ నగరాల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు.