చెప్పామంటే చేయాలి.. చేయగలిగిందే చెప్పాలి..!
ABN , Publish Date - May 13 , 2026 | 04:10 AM
ఆరు సార్లు ఎమ్మెల్యే. ఐదు పర్యాయాలు మంత్రి. ఒక్కసారి తప్ప గెలిచిన ప్రతిసారీ మంత్రే. అదే ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నిలిపింది.
ఆవేశం, ముక్కు సూటితనమే నా బలం..
ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టుల్లో నా ముద్ర..
ఎన్టీఆర్ రోడ్డుపక్కన స్నానం చేస్తుండగా కలిశా
కార్లో చర్ల తీసుకెళ్తూ నా గురించి చెప్పుకోగలిగా
తొలిసారి ఓడినా ఎన్టీఆర్ అక్కున చేర్చుకున్నారు
రెండోసారి గెలిచిన ఏడాదికే మంత్రిని చేశారు
నా ఎన్నికల ఖర్చు కార్యకర్తలే చూసుకున్నారు
తాజా ఎన్నికల కోసమే ఆస్తి అమ్మాల్సి వచ్చింది
కుటుంబంతో కలిసి చూసింది ఒకే సినిమా
సంక్షేమం ఖర్చు గాడి తప్పింది బాబుతోనే
ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి గేట్లెత్తేశారు
రాజకీయం ఇంకెన్నాళ్లో అభిమానులే చెప్పాలి
తొలిసారి మంత్రి అయి నలభై ఏళ్లయిన సందర్భంగా ఆంధ్రజ్యోతికి తుమ్మల ప్రత్యేక ఇంటర్వ్యూ
హైదరాబాద్, మే 13, (ఆంధ్రజ్యోతి): ఆరు సార్లు ఎమ్మెల్యే. ఐదు పర్యాయాలు మంత్రి. ఒక్కసారి తప్ప గెలిచిన ప్రతిసారీ మంత్రే. అదే ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నిలిపింది. నలభై ఏళ్ల క్రితం 1986 మే 14న తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 40 ఏళ్ల తర్వాత ఇప్పటికీ మంత్రిగానే ఉండడం విశేషం ఏకంగా 20 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన రికార్డు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనదే.. ఉన్నది ఉన్నట్లు చెప్పే ముక్కుసూటితనం, రాజకీయాలు తప్ప వ్యాపారాల వైపు చూడని నైజం. ఏ శాఖలో ఉన్నా ఆ శాఖను ఆమూలాగ్రం ఆకళింపు చేసుకుని పనులు, ప్రాజెక్టులను ముందుకు నడిపించిన చరిత్ర ఆయన సొంతం. రాజకీయాల్లో తేడా వస్తే అంటే పోయేదేముంది, నా రైతు పదవిని ఎవరూ తీయలేరుగా! అని చెప్పే ధైర్యం ఆయనకే చెల్లింది. ఎన్టీఆర్ హయాంలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తుమ్మల నాగేశ్వర్‌రావు తెలుగు రాష్ట్రాల్లో అనేక కీలక రాజకీయ ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి. మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి రేపటికి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఆవేశం, ముక్కుసూటితనం, కొందరేమో మీకు నోటిదురుసు కూడా అని అంటుంటారు. ఈ ట్యాగ్‌లైన్‌లు ఇబ్బంది కలిగించలేదా?
రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ నాది ఒకటే శైలి. చేయగలిగిందే చెప్పాలి. చెప్పామంటే చేయాలి. నేరుగా మొహంమీదే చేయలేం అని కరాఖండీగా చెప్పేస్తారా? అని అనుకోవచ్చు. కానీ మభ్యపెట్టడం, మసిపూసి మారేడుకాయ చేయడం నావల్ల కాదు. ఆ ఆవేశం, ముక్కు సూటితనమే రాజకీయాల్లో నాకో ప్రత్యేకతను ఇచ్చిందని అనుకుంటాను. కొన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ చంద్రబాబును పార్టీలోకి తీసుకోవడంపై అభిప్రాయం అడిగినపుడు యువకుడిగా ఉన్న నేను సూటిగా అభిప్రాయాన్ని చెప్పేశాను. మీ మీదే పోటీ చేస్తా అన్న నాయకుడిని తీసుకోవాలా? అని ప్రశ్చించాను. ఎన్టీఆర్ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి కమిటీ ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. తర్వాత చంద్రబాబు తన సమర్దతను నిరూపించుకోవడం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీలో చేరడం, ఎన్టీఆర్‌తో మీ తొలి పరిచయం ఎలా జరిగాయి?
1975లో డిగ్రీ పూర్తి చేశాక గ్రామ రాజకీయాల్లోకి వచ్చాను. సమితి ఎన్నికలు వచ్చాయి. మా గ్రామం గండుగులపల్లి నుంచి సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఒక పెత్తందారీ కుటుంబానికి వ్యతిరేకంగా బీసీ అభ్యర్థిని నిలబెట్టాం. జలగం వెంగళరావును ఒప్పించి, ఆమోదం తీసుకునే ఈ పని చేశా. విపరీతంగా ప్రచారం చేశాం. నలుగురు యువకులం తలా రూ.10 వేల చొప్పున వేసుకుని ఎన్నికల ఖర్చు కూడా భరించాం. పెత్తందారును ఓడించాం. ఆ తర్వాత అనుకోని ఘటన ఒకటి జరిగింది. వెంగళరావు కుమారుడు ప్రసాదరావు సదరు సమితి అధ్యక్షుడిని పిలిచి, తుమ్మలతో నువ్వు మాట్లాడొద్దు, అతనితో కలిసి సత్తుపల్లి కార్యాలయానికి రావొద్దు అని చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్న జలగం కుటుంబం ఇందిరా కాంగ్రెస్‌లోకి మారింది. ప్రసాదరావుతో మాట పట్టుదల వచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. భద్రాచలానికి ఎన్టీఆర్ వస్తుండడంతో ఆ పార్టీలో చేరేందుకు కొంతమంది సర్పంచులు, నేతలతో కలిసి అక్కడికి వెళ్లా. మూడు అద్దె కార్లు తీసుకుని మరీ వెళ్లాం. ఆ రోజు ఆయన పర్యటన అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్ల వరకు వెళ్లి మళ్లీ భద్రాచలం వచ్చి, మళ్లీ అక్కడి నుంచి కృష్ణా జిల్లాకు పర్యటన సాగాలి. అడుగడుగునా నీరాజనం పడుతున్న జనంతో ఆలస్యం అవుతుందని గ్రహించి చర్ల కార్యక్రమం రద్దు చేశారు. ఎన్టీఆర్ అప్పుడు జ్వరంతో ఉన్నారు. చర్లకు చెందిన కొందరు అభిమానులు నా దగ్గరకు వచ్చి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు, రావాలని మీరు చెప్పండన్నారు. నేనెవరో అప్పటికి ఎన్టీఆర్‌కు తెలియదు. ఆయన రాత్రిపూట రోడ్డుపై స్నానం చేస్తున్నప్పుడు వెళ్లి పరిచయం చేసుకుని పరిస్థితి చెప్పా. ఎలా బ్రదర్, అక్కడికి వెళ్లి మళ్లీ తిరిగిరావాలి, సాధ్యమయ్యేపనేనా! అన్నారు. రాత్రంతా ప్రజలు వేచిచూస్తూనే ఉంటారు సార్! తెల్లవారుజామున మూడు గంటలకు బయల్దేరి వెళ్లిపోదాం. ఉదయానికి మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చేద్దాం అన్నా. కారుందా? అని ఆయన అడిగితే... ఉందన్నా. ఉదయాన్నే లేచి ఐదు గంటలకు చర్ల చేరుకున్నాం. ఎన్టీఆర్ రాకను తెలియచేస్తూ గ్రామంలో ఉదయాన్నే డప్పేశారు. నిమిషాల్లో అక్కడ 15 వేలమందిపోగయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడాక మళ్లీ భద్రాచలం కారులో వచ్చేశాం. కారులో నా గురించి ఆయనకు చెప్పా. ఓకే బ్రదర్. పార్టీలోకి రండి అన్నారు.
1983లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడమే కారణమనీ అనుకున్నారు. దీనిపై ఎన్టీఆర్ ఏమన్నారు?
అప్పటికి సత్తుపల్లి అంటే మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గుత్తాధిపత్యం. అయినా నేను 7-8 వేలమందితో వెళ్లి నామినేషన్ వేశా. గ్రామాల నుంచి సైకిళ్లు వేసుకుని వచ్చే యువకులతో కలిసి ఊరూరా తిరిగాం. ఆ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఎన్టీఆర్ సత్తుపల్లి ప్రచారానికి వచ్చేలా కార్యక్రమం ఉండింది. ఆయన అక్కడికి వచ్చి గుడివాడ వెళ్లాలి. చివరిరోజు భారీగా జనం, ప్రచార కార్యక్రమాలు ఎక్కువ ఉండడంతో సత్తుపల్లిలో ఆగలేదు. ఆయన వచ్చి ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరేగా ఉండేది. పోలింగ్ రోజున మా సొంత గ్రామంలో ఒక తెలుగుదేశం నేతను హత్య చేయించి భయోత్పాతం సృష్టించారు. దీంతో స్పల్ప తేడాతో ఓడిపోయా. పార్టీ అధికారానికి వచ్చింది. ఫలితాలు వచ్చిన మర్నాడు ఎన్టీఆర్ నుంచి టెలిగ్రాం వచ్చింది. స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని. వెంటనే బయల్దేరి వచ్చా. రామకృష్ణా స్టూడియో్‌సలో సందడి. ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లా. సారీ బ్రదర్. రాలేకపోయాం. మీరు ఓడిపోయారు అన్నారు. ఈలోపు నాదెండ్ల భాస్కర్‌రావు వచ్చారు. ఇక అంతా బయటికెళ్లాలి అన్నారు. నేను కూడా లేచా. కానీ ఎన్టీఆర్ ‘‘మీకు అన్యాయం జరిగింది. కూర్చోండి. వారిని కూర్చోనివ్వండి’’అన్నారు. బ్రదర్ 9వ తేదీన ప్రమాణస్వీకారం. తప్పకుండా రండి. వీరికి పాస్ ఇవ్వండి అని సిబ్బందికి చెప్పారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం అభ్యర్థులందరికీ ఎమ్మెల్యే(డి) అని పాస్‌లు కొట్టించారు. డి అంటే డిఫీటెడ్(ఓడిన) అని. ఆ తర్వాత అవే పాస్‌లు మాకు 1985 వరకు సచివాలయానికి వెళ్లేందుకు ఉపయోగించుకునేలా చేశారు.
1986లో ఏం జరిగింది? మొదటిసారి మంత్రి పదవి వచ్చిందని ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు?
1985 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి గెలిచా. ఆ తర్వాత సంవత్సరం 1986 మే 14వ తేదీన మంత్రివర్గంలోకి కొత్తగా ఐదుగురిని తీసుకున్నారు. అందులో నేను, మోత్కుపల్లి నర్సింహులు, పి.మణెమ్మ, హెచ్.బి.నర్సేగౌడ్, ముక్కు కాశిరెడ్డి ఉన్నాం. మే 10న మా అన్న చెన్నారావు పెళ్లి. ఆ కార్డు ఇవ్వడానికి 9వ తేదీన ఎన్టీఆర్‌ను కలిశాను. నాటి నేతలు జానారెడ్డి, వసంత నాగేశ్వర్‌రావు, మహిపాల్‌రెడ్డి తదితరులకు కార్డులిచ్చి గండుగులపల్లి వెళ్లిపోయా. సాయంత్రం ఐదు గంటలకు ఫోన్ మోగింది. ఎత్తగానే... ఎన్టీఆర్‌ను మాట్లాడుతున్నా... ఉదయం నాలుగు గంటలకు ఇక్కడుండండి అన్నారు. వెళ్లి కలిశా. బ్రదర్ ఏంటి? మిమ్మల్ని ఆదరిస్తే ఇలా చేస్తారా? ఏమిటిది? అని ప్రశ్నించారు. అప్పటి నిఘా విభాగం చీఫ్ విజయ రామారావు ఇచ్చిన ఒక కాగితాన్ని నాకిచ్చారు. అది తీసుకుని బయటికొచ్చా. అందులో మూడంశాలున్నాయి. ఒకటి డీఎ్‌సపీ బదిలీల్లో బదిలీ అయిన అధికారిని మళ్లీ అక్కడే ఉంచేలా సిఫార్సు చేశారు. రెండు.... సత్తుపల్లిలో ప్రభాకర్‌రావు భూమి విషయంలో అతనికి మద్దతిచ్చారు. మూడు... అంబాసిడర్ కారు కొన్నారు. చదివాక కోపం వచ్చింది. మళ్లీ లోపలికెళ్లా. డీఎ్‌సపీ విషయం....సదరు డీఎ్‌సపీని నువ్వు పచ్చా చొక్కా తొడుక్కో అని 1984 ఎంపీ ఎన్నికల్లో జలగం వెంగళరావు వేదికపై నుంచే అన్నారు. ఆ విషయం మీ దృష్టికి తెస్తే మీరే రిటెయిన్ చేద్దామన్నారు అని చెప్పా. రెండో విషయం...ప్రభాకర్‌రావు భూమి అతనికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమి. అందులో న్యాయం ఉందన్నా. మూడోది అంబాసిడర్ కారు. కారు ఖరీదు రూ.60 వేలు. అది సెకండ్ హ్యాండ్. ఆరుగురు కలిసి తలా పది వేలు వేసుకుని తెనాలి వెళ్లి కారు కొనుక్కుని ఇచ్చారు అన్నా. ఈ మూడింటిలో ఏది తప్పైనా మీకు నా మోహం చూపించను అని లేచి బయటకు వచ్చేస్తున్నా. ‘‘రండి బ్రదర్. అర్థమైంది. అందుకే మీకు మంత్రి పదవి ఇస్తున్నా. మే 14న ప్రమాణస్వీకారం. రండి.’’ అన్నారు.

రాజకీయాలో బాధపడ్డ ఘటనలు ఉన్నాయా?
ఎన్టీఆర్‌ను దించాల్సి వచ్చినప్పుడు బాధపడ్డా. అయితే పార్టీని దీర్ఘకాలం ఉంచేందుకు అది అవసరం కావడంతో చేయాల్సి వచ్చింది.
అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులేంటి?
తొలిసారి ఎన్నికల్లో నేను రూ.3.60 లక్షలు ఖర్చు చేశా. అప్పటికి అది ఎక్కువే. జలగం కుటుంబాన్ని ఎదుర్కోవడానికి తప్పలేదు. అందులో మూడు లక్షలు గ్రామాల్లోని నేతలు, కార్యకర్తలే వేసుకున్నారు. నాది రూ.30 వేలు మాత్రమే. రూ.30 వేలు అప్పు. వడ్లు, జొన్నలు అమ్మి ఆ అప్పు తీర్చేశా. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోను నేను అప్పు చేయలేదు. సొంత డబ్బులు పెట్టాల్సిన అవసరం శ్రేయోభిలాషులు, నేతలు, అభిమానులు రానీయలేదు. అప్పుడు ఓటర్లకు ఏదైనా ఇస్తే మమ్మల్ని నమ్మడం లేదా? అవమానిస్తున్నారా? అనేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. గత ఎన్నికల్లో ఒక ఆస్తిని అమ్మి ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
పదవిలో ఏం అంశం బాగా సంతృప్తినిచ్చింది?
చిన్ననీటి పారుదల నా తొలి మంత్రిత్వ శాఖ. ఆ తర్వాత ఎక్సైజ్, భారీ సాగునీటి పారుదల, రోడ్లు, భవనాలు...ఇప్పుడు వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్నా. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల, ఎస్‌ఎల్‌బీసీ, ఏపీలో తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి తదితర ప్రాజెక్టుల రూపకల్పన నా హయాంలోనే జరిగింది. స్వర్ణ చతుర్బుజి పథకం కింద వచ్చిన జాతీయ రహదారుల పనులను అత్యంత వేగంగా చేయించాం. మౌలిక సదుపాయాల మంత్రిగా శంషాబాద్ విమానాశ్రయం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికల్లో భాగం ఉంది. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తేవడంతో నా కల. దాని సాకారం కోసం పని చేశా.
కుటుంబ వ్యవహారాలు పట్టించుకోరని ఫిర్యాదులు..
ఇంటి ఫంక్షన్లకు తప్ప బయటి ఫంక్షన్లకు నా భార్యతో కలిసి వెళ్లింది లేదు. భార్య, పిల్లలతో చూసింది ఒకే ఒక్క సినిమా(బొమ్మరిల్లు). జేబులో రూపాయి కూడా పెట్టుకోకుండా జీవితం గడిపేశాను. చేతికి ఒక్క ఉంగరం మాత్రం ఉంటుంది. చుట్టూ ఎవరూ లేని పరిస్థితిలో తాకట్టు పెట్టొచ్చని(నవ్వుతూ). వ్యవసాయంపై వచ్చే ఆదాయం, కుటుంబ వ్యవహారాలు నా సతీమణి భ్రమరాంభ చూసుకోవడమే.

ఎవర్నీ లెక్కచేయరు. ఇంకెన్నాళ్లు రాజకీయం?
వ్యవసాయం అంటే నాకిష్టం. నా ధైర్యం కూడా రైతు మనస్తత్వమే అనుకుంటా. నా ప్రభుత్వం వల్ల పదిమందికీ మంచి జరగాలని అనుకుంటా. అందరూ మెచ్చుకునేలా జీవితం ఉండాలి. తెలుగుదేశంలో, బీఆర్‌ఎస్‌లో, కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నా. ఖమ్మంలో నాకు చెప్పకుండా నా ప్రత్యర్థికి బీఆర్‌ఎస్ సీటు ఇచ్చింది. అలా చేయడం బాధ కలిగించింది. ఓడినచోటే గెలిచి నిలవాలని అనుకునే మొన్నటి ఎన్నికల్లో నిలబడ్డా. ఓటమితో రాజకీయాల నుంచి నిష్క్రమించకూడదని నా కోరిక. రాజకీయాల్లో ఇంకెంతకాలం అంటే అభిమానులు, ప్రజలు కోరుకున్నంత కాలం. దీనిలో నా వ్యక్తిగతం ఏమీలేదు.
ప్రభుత్వ బడ్జెట్‌లు మీ తొలినాళ్లలో ఎలా ఉండేవి?
అప్పట్లోను సంక్షేమం ఉండేది. కానీ అవసరం ఉన్న వారికి. కష్టంలో ఉన్నవారికి మాత్రమే. ఇప్పుడు అందరికీ సంక్షేమం అన్న అనివార్య పరిస్థితికి వచ్చేశాం. ఎన్టీఆర్ హయాంలో అభివృద్ది-సంక్షేమం నడిచింది. చంద్రబాబు రెండో విడత గాడి తప్పడం ప్రారంభమైంది. అర్హులు, అనర్హులు అని లేకుండా సంక్షేమం ప్రారంభమైంది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో గేట్లు ఎత్తేశారు. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అదే బాణీ. సంక్షేమ పథకాలకు అందరూ అర్హులే అన్న కొత్త విధానం పుట్టుకొచ్చింది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించలేని పరిస్థితి నెలకొంది.