పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్
ABN , Publish Date - May 13 , 2026 | 10:19 AM
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్ ఆల్విన్ కాలనీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో మొదలయ్యాయి.
ఆల్విన్ కాలనీ ఫ్లై ఓవర్ పనులు షురూ
గచ్చిబౌలి, బాచుపల్లి వైపు నుంచి రెండు అండర్ పాస్‌లు
మొత్తం ప్రాజెక్టు కోసం రూ.530 కోట్ల వ్యయం
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్ ఆల్విన్ కాలనీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో మొదలయ్యాయి. మియాపూర్ మెట్రోస్టేషన్ తర్వాత నుంచి ప్రారంభమై మియాపూర్ ఎక్స్‌రోడ్డు, ఆల్విన్ కాలనీ ఎక్స్ రోడ్డు మీదుగా చందానగర్ వైపు సుమారు 1.8 కి.మీ దీన్ని నిర్మించనున్నారు. దీంట్లో భాగంగానే మరో 2 అండర్ పాస్‌లను గచ్చిబౌలి వైపు నుంచి మియాపూర్ వైపు, బాచుపల్లి నుంచి అల్విన్ కాలనీ వైపు నిర్మించనున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌గా కాకుండా రాష్ట్ర బడ్జెట్ కింద ఈ ప్రాజెక్టు పనులను చేపడుతున్నారు.
ఈ పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మియాపూర్-ఆల్విన్ ఎక్స్‌రోడ్డు మార్గం ప్రస్తుతం నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటిగా ఉంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, బాచుపల్లి-ప్రగతినగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయి, నిర్మాణ పనుల ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
రూ.530 కోట్లతో నిర్మాణ పనులు
ఈ టెండర్‌ను శివ సత్య ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ దక్కించుకొని క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 24 మీటర్ల వెడల్పు, 1.8 కి.మీ పొడువు, 6 వరసలతో ఈ ఫ్లైఓవర్‌ను, 2 అండర్ పాస్‌లను నిర్మించనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.530 కోట్లు కేటాయిస్తే, అందులో కొంత మొత్తాన్ని ఆస్తుల సేకరణ కోసం, మిగతా మొత్తాన్ని ప్లై ఓవర్, 2 అండర్ పాస్‌ల నిర్మాణానికి వెచ్చించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్.. క్రమంగా పెరుగుతున్న ధరలు
హైదరాబాద్-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News